ఈ కండల రాణి మిస్ ఇండియా!

6 Apr, 2016 09:39 IST|Sakshi
ఈ కండల రాణి మిస్ ఇండియా!

ఉక్కు నరాలు, ఇనుప కండలు, వజ్ర సంకల్పం.. ఇవే యువతకు కావాలంటాడు స్వామి వివేకానంద. ఆయన దారిలోనే సాగుతున్నట్టు కనిపిస్తోంది 36 ఏళ్ల యాష్మిన్ మనాక్. అందమైన తన దేహాన్ని సిక్స్ ప్యాక్ బాడీగా మార్చిన ఆమె తాజాగా మిస్ ఇండియా 2016గా ఎంపికైంది. అయితే ఆమెకు ఈ పురస్కారాన్ని ఇచ్చింది ఏ అందాల పోటీనో కాదు. ఈ కండల లేడీని గౌరవించి ఇండియన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్ నెస్ ఫెడరేషన్ (ఐబీబీఎఫ్ఎఫ్) ఈ టైటిల్ ను ప్రదానం చేసింది.

తాను కూడా అందరిలాంటి అమ్మాయినేనని, కానీ ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధ్యానమిస్తానని చెప్తోంది యాష్మిన్. గత 17 ఏళ్లుగా వెయిట్ లిఫ్టింగ్ సాధన చేసిన ఈ అమ్మడు మూడేళ్ల నుంచి బాడీ బిల్డింగ్ మీద దృష్టి పెట్టింది. అకుంఠిత దీక్షతో ఆమె చేసిన కృషి ఫలంగా.. ఐబీబీఎఫ్ఎఫ్ ఇటీవల యూపీలోని బులంద్ షహర్ లో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలో ఆమెను రెండు పురస్కారాలు వరించాయి. వుమెన్ ఫిజిక్యూ కేటగిరీలో, వుమెన్ ఫిట్ నెస్ కేటగిరిలో రెండు బంగారు పతకాలను ఆమె సొంతం చేసుకుంది.

ఢిల్లీలో జన్మించిన యాష్మిన్ కు చిన్నప్పటి నుంచి ఆటలంటే ప్రాణం. 'ఒక అమ్మాయిగా బాడీబిల్డింగ్ కెరీర్ ను ఎంచుకోవడం చాలా పెద్ద సవాలే. ఇది కేవలం పురుష ఆధిపత్యమున్న క్రీడ అన్న భావన ఉంది. కానీ, నా కుటుంబసభ్యులు, స్నేహితులు ఎంతగానో అండగా నిలిచారు. కొంతమంది నిరుత్సాహ పరిచినవాళ్లు ఉన్నారనుకోండి. కానీ వాళ్లను నేను పట్టించుకోలేదు' అని చెప్తోంది యాష్మిన్. సరికొత్త సవాళ్లను స్వీకరించడం తనకు ఇష్టమని, అందుకే బాడీ బిల్డింగ్ ను ఎంచుకున్నట్టు తెలిపింది. 'మామూలుగా ఉండటం బోరింగ్. పాతనమ్మకాలను బద్దలు కొట్టడం నాకు ఇష్టం. నేను బుల్లెట్ బైకును నడుపుతాను. పవర్ లిఫ్టింగ్ చేస్తాను. మగవారి కన్నా మరింత కండలు పెంచడాన్ని ఇష్టపడతాను' అని అంటున్నది యాష్మిన్. వచ్చే సెప్టెంబర్ లో భూటాన్ లో జరుగనున్న ఆసియన్ బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్యూ చాంపియన్ షిప్ 2016లోనూ తన సత్తా చాటేందుకు ఆమె ప్రస్తుతం పూర్తిస్థాయిలో సిద్దమవుతున్నది. ఆల్ ది బెస్ట్ యాష్మిన్ మనాక్.

మరిన్ని వార్తలు