యోధుడికి వీడ్కోలు

25 Feb, 2016 00:43 IST|Sakshi
యోధుడికి వీడ్కోలు

చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మెకల్లమ్
ఇక టి20 లీగ్‌ల ద్వారా మాత్రమే అభిమానులకు వినోదం

  
సాక్షి క్రీడావిభాగం  యుద్ధానికి వెళుతున్నప్పుడు తన సైన్యం బలహీనంగా ఉందని తెలిస్తే రాజు ఏం చేయాలి..? ముందే వెళ్లి ప్రత్యర్థులు కోలుకోలేనంతగా వీరవిహారం చే యాలి. మిగిలిన సైన్యానికి పెద్దగా పని లేకుండానే గెలవాలి. న్యూజిలాండ్ కెప్టెన్ మెకల్లమ్ కూడా అంతే. సారథిగా తనకు ఎప్పుడూ ప్రపంచంలో ఉత్తమ జట్టు అనిపించుకునే ఆటగాళ్లు లేరు. అయినా ఒంటిచేత్తో న్యూజిలాండ్‌కు విజయాలు అందించాడు. ఆరంభంలో పది ఓవర్లలోనే వన్డే మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేసుకుంటాడు. అదే అతడిని దిగ్గజాల సరసన చేర్చింది.

మెకల్లమ్‌కు ముందు ఆటలో అనేక మంది గొప్ప బ్యాట్స్‌మెన్ ఉన్నారు. భవిష్యత్‌లోనూ అంతకు మించిన క్రికెటర్లు రావచ్చు. కానీ ఎంత మంది వచ్చినా మెకల్లమ్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఫ్లాట్ వికెట్లపై చెలరేగే ఎంతోమంది హిట్టర్స్... పచ్చటి పిచ్‌పై బంతిని ఆడటానికి భయపడే చోట మెకల్లమ్ విధ్వంసం సృష్టిస్తాడు. అదే అతని గొప్పతనం. తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ఈ న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ అదే చేసి చూపించాడు.

పుష్కరకాలం పాటు బ్రేక్ లేకుండా...
ప్రస్తుతం ఉన్న క్రికెట్ షెడ్యూల్‌లో ఏ ఆటగాడికీ వరుసగా అన్ని మ్యాచ్‌లూ ఆడటం సాధ్యం కాదు. అలాంటిది 12 సంవత్సరాల సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో మెకల్లమ్ ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు. అరంగేట్రం నుంచి వరుసగా 101 టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించి రిటైరయ్యాడు. టెస్టు కెరీర్‌లో 106 సిక్సర్లతో రికార్డు, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (54 బంతులు) రికార్డులు కెరీర్ చివరి టెస్టులో సాధించాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక న్యూజిలాండ్ క్రికెటర్ కూడా మెకల్లమే.

2002లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తర్వాత ఆరేళ్ల పాటు మెకల్లమ్ చాలా సాధారణ ఆటగాడు. 2008 తన కెరీర్‌ను మార్చేసింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనర్‌గా ప్రమోట్ కావడంతో కెరీర్‌లో తొలి వన్డే సెంచరీ సాధించాడు. ఇదే ఏడాది న్యూజిలాండ్‌కు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత తను వెనుదిరిగి చూడలేదు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగుల రికార్డుతో పాటు రెండు సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా కూడా రికార్డు సొంతం చేసుకున్నాడు.

లీగ్‌లలో చూస్తాం
ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ద్వారా మెకల్లమ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. అయితే తను ఐపీఎల్‌తో సహా అనేక టి20 లీగ్‌లలో కనిపిస్తాడు. కాబట్టి మెకల్లమ్ మెరుపులను పూర్తిగా మిస్ కాలేదు. అయితే న్యూజిలాండ్ క్రికెట్‌కు తన సేవలు లేకపోవడం పెద్ద లోటు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఆటలో ఎంత దూకుడు చూపించినా ప్రత్యర్థుల పట్ల మాత్రం చాలా స్నేహంగా వ్యవహరించాడు. ఏనాడూ ఏ ప్రత్యర్థినీ దూషించలేదు. కెప్టెన్‌గా చక్కటి క్రీడాస్ఫూర్తితో వ్యవహరించాడు. అందుకే తనకు మైదానం బయట స్నేహితులు, గౌరవం ఎక్కువ.

క్రికెట్ కుటుంబం
డునెడిన్‌లో జన్మించిన మెకల్లమ్ ప్రస్తుత వయసు 34 సంవత్సరాలు. ఇంకా విధ్వం సకరంగా ఆడుతూ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. అయినా ఎందుకు రిటైరయ్యాడనేది పెద్ద ప్రశ్న. టి20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపికలోకి తనని పరిగణనలోకి తీసుకోకూడదని 3నెలల ముందే (గత డిసెంబరులో) రిటైర్‌మెంట్ నిర్ణయా న్ని ప్రకటించాడు. మెకల్లమ్ తండ్రి స్టువర్ట్ మెకల్లమ్ దేశవాళీ క్రికెట్ ఆడారు. తమ్ముడు నాథన్ మెకల్లమ్ కూడా బ్రెండన్‌తో కలిసి అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.
  
 మెకల్లమ్ అంతర్జాతీయ కెరీర్

 ఫార్మాట్    మ్యాచ్‌లు    పరుగులు    సెంచరీలు    సగటు
 టెస్టులు     101           6453             12      38.64
 వన్డేలు     260             6083              5      30.41
 టి20లు     71             2140               2      35.66
 
 
 
   సరైన సమయంలోనే రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకున్నా. కెరీర్‌ను చాలా ఆస్వాదించా. కెప్టెన్‌గా జట్టులో మంచి సంస్కృతిని పెంచాను. నాతో కలిసి ఆడిన వాళ్లు, నా ఆటను చూసిన వాళ్లకు ఎప్పుడూ గుర్తుండిపోతానని అనుకుంటున్నాను. నా రిటైర్‌మెంట్ సమయంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు చూపించిన గౌరవం చాలు... నేను సాధించిన దానితో తృప్తి చెందడానికి. చివరి మ్యాచ్, సిరీస్ ఓడిపోయి వైదొలగడం ఎవరికైనా బాధ కలిగిస్తుంది. కానీ చాలా అనుభవాలతో సంతోషంగా వెళుతున్నాను.             - మెకల్లమ్

>
మరిన్ని వార్తలు