మెస్సీ ‘రికార్డు’ షో

20 Jun, 2016 00:32 IST|Sakshi
మెస్సీ ‘రికార్డు’ షో

సెమీఫైనల్లోకి అర్జెంటీనా
వెనిజులాపై 4-1తో విజయం
►  కోపా అమెరికా కప్

 
ఫాక్స్‌బరో (అమెరికా): కోపా అమెరికా కప్‌లో సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టోర్నీలో నాలుగో గోల్ సాధించడంతో పాటు అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ (54) చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. ఆదివారం వెనిజులాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌ను మెస్సీ అంతా తానై శాసించడంతో అర్జెంటీనా 4-1తో నెగ్గి సెమీస్‌కు చేరింది. 60వ నిమిషంలో చేసిన గోల్‌తో మెస్సీ ఇప్పటిదాకా గాబ్రియల్ బటిస్టుటా పేరిట ఉన్న అత్యధిక గోల్స్ రికార్డును సమం చేశాడు.
 

అలాగే జట్టు సాధించిన మరో రెండు గోల్స్‌లోనూ తన పాత్ర ఉండడం విశేషం. గోంజలో హిగువాన్ (8వ, 28వ నిమిషాల్లో), లమేలా (71వ నిమిషంలో) మిగతా గోల్స్ చేశారు. వెనిజులా నుంచి రోండన్ (70వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. బుధవారం జరిగే సెమీఫైనల్లో అర్జెంటీనా జట్టు అమెరికాతో తలపడుతుంది. అంతకుముందు ప్రథమార్ధం నుంచే మెస్సీ తన మేజిక్‌ను చూపాడు. దీంతో 8వ నిమిషంలోనే జట్టు ఆధిక్యం సాధించింది. టచ్‌లైన్ నుంచి పెనాల్టీ ఏరియాలోకి మెస్సీ ఇచ్చిన అద్భుత పాస్‌ను అందుకున్న హిగువాన్ ఏమాత్రం అలక్ష్యం చేయకుండా గోల్ చేశాడు. ఆ తర్వాత కూడా వెనిజులా గోల్‌పోస్టుపై అర్జెంటీనా దాడులను కొనసాగించింది. అయితే 27వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడు గోంజలెజ్‌ను అడ్డుకున్నందుకు నికోలస్ గైటాన్ ఎల్లో కార్డుకు గురయ్యాడు. దీంతో తను అమెరికాతో సెమీస్‌కు దూరం కానున్నాడు.


 వర్గాస్ నాలుగు గోల్స్...
 సాంటా క్లారా (అమెరికా): వరుస విజయాలతో దూసుకెళుతున్న మెక్సికో జట్టుకు డిఫెండింగ్ చాంపియన్ చిలీ బ్రేక్ వేసింది. ఫార్వర్ట్ ఆటగాడు ఎడ్వర్డో వర్గాస్ (44, 52, 57, 74వ నిమిషాల్లో) ఏకంగా నాలుగు గోల్స్‌తో అదరగొట్టడంతో పాటు పేలవమైన ఆటతీరుతో మెక్సికో మూల్యం చెల్లించుకుంది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిలీ 7-0తో మెక్సికోను చిత్తుగా ఓడించింది. ఓ మేజర్ టోర్నీలో ఈ జట్టు ఇంత ఘోరంగా ఓడడం ఇదే తొలిసారి. గతంలో 1978 ప్రపంచకప్‌లో మెక్సికో 0-6తో పశ్చిమ జర్మనీ చేతిలో ఓడింది. 70 వేలకు పైగా ఉన్న మెక్సికో మద్దతుదారుల మధ్య చిలీ ఈ మ్యాచ్‌లో అసమాన ప్రతిభను చూపింది. 13 నిమిషాల వ్యవధిలోనే వర్గాస్ హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఎడ్సన్ పూచ్ (16వ, 87వ ని.లో) రెండు గోల్స్, అలెక్సిస్ సాంచెజ్ (49వ ని.లో) ఓ గోల్ చేశాడు.

మరిన్ని వార్తలు