ఎవరొచ్చారనేది కాదు.. గెలిచామా? లేదా?

16 Sep, 2019 19:38 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : ఆటగాళ్లు ఎవరొచ్చినా సిరీస్‌ గెలవడంపైనే దృష్టిపెట్టాలని పాకిస్తాన్‌ క్రికెటర్లకు ఆ దేశ మాజీ ఆటగాడు జావేద్‌ మియాందాద్‌ సూచించాడు. వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు పాకి​స్తాన్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా లసిత్‌ మలింగతో సహా పది మంది రెగ్యులర్‌ ఆటగాళ్లు పాక్‌కు వెళ్లి క్రికెట్‌ ఆడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే ఆ దేశ క్రీడా మంత్రి ఆటగాళ్లతో స్వయంగా మాట్లాడినప్పటికీ పాక్‌కు వెళ్లేందుకు ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే సిరీస్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలని లంక బోర్డు కోరగా పాక్‌ సున్నితంగా తిరస్కరించింది.  దీంతో ఈ సిరీస్‌పై సందిగ్దత నెలకొంది. అయితే టాప్‌ ప్లేయర్స్‌ను కాకుండా జూనియర్‌ ఆటగాళ్లను పాక్‌కు పంపించాలనే ఆలోచనలో లంక బోర్డు ఉంది. దీనిపై మియాందాద్‌ స్పందించాడు. 

‘ఆటగాళ్లు ఎవరొచ్చినా పాక్‌ ఆటగాళ్లు సిరీస్‌ గెలవడంపైనే దృష్టి పెట్టండి. ప్రత్యర్థి జట్టు బలంగా, బలహీనంగా ఉన్నా మన ఆట మనం ఆడాలి. గెలవాలి. సిరీస్‌ ఉందంటే ఆటగాళ్లు వెళ్లాలి ఆడాలి. అంతేగానీ మేం వెళ్లం అనడం సరైనది కాదు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఆ ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా’అంటూ మియాందాద్‌ వ్యాఖ్యానించాడు. ఐసీసీ కూడా పాక్‌లో ప్రస్తుత క్రికెట్‌ పరిస్థితుల, భద్రతా చర్యలపైనా ఓ కమిటీని ఏర్పాటు చేసింది.     

ఇక 2009లో పాక్‌లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టుపై దాడులు జరిగాయి. బస్సులో ప్రయాణిస్తున్న శ్రీలంక క్రికెటర్లపై అగంతుకులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో బస్సులోని శ్రీలంక క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఏ క్రికెట్‌ జట్టు కూడా పాకిస్తాన్‌లో పర్యటించే సాహసం చేయలేదు. దీంతో తటస్థ వేదికల్లోనే పాక్‌ క్రికెట్‌ ఆడుతూ వస్తోంది.  శ్రీలంక సిరీస్‌తో పాక్‌లో క్రికెట్‌ పునర్వైభం తీసుకరావాలని భావిస్తున్న పాక్‌కు నిరాశ తప్పేలా లేదు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా