ఇక నేను ఆడలేనేమో: క్లార్క్

14 Dec, 2014 00:34 IST|Sakshi
ఇక నేను ఆడలేనేమో: క్లార్క్

గాయం కారణంగా సిరీస్‌కు దూరం
 అడిలైడ్: భారత్‌తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ దూరమయ్యాడు. తొలి టెస్టు చివరి రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో కుడి మోకాలి కండరాలు పట్టేయడంతో క్లార్క్ మైదానం నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత స్కానింగ్ కోసం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ తన కుడి కండర ంలో చీలిక వచ్చినట్టు తేలింది. ఆ తర్వాత మైదానంలో కనిపించినప్పటికీ కుంటుతూనే నడిచాడు. దీంతో మిగిలిన టెస్టు సిరీస్‌కు దూరమవుతున్నట్టు ప్రకటించాడు. క్లార్క్ స్థానంలో నాయకత్వ బాధ్యతలను వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్‌కు అప్పగించే అవకాశం ఉంది.
 
 రెండో టెస్టుకు మార్ష్: క్లార్క్ సిరీస్‌కు దూరం కావడంతో రెండో టెస్టుకు షాన్ మార్ష్ జట్టులోకి రానున్నాడు. ఈనెల 17 నుంచి బ్రిస్బేన్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. మార్ష్‌తో పాటు పేసర్ మిచెల్ స్టార్క్‌ను కూడా ఎంపిక చేశారు.
 
 ‘వైద్య నిపుణులు నా గాయానికి సంబంధించిన స్కాన్లను పరిశీలిస్తున్నారు. ఎంతకాలం ఆటకు దూరంగా ఉంటానో నాకు తెలీదు. వన్డే ప్రపంచకప్ గురించి ఆలోచిస్తున్నాను. మా తొలి ప్రాక్టీస్ గేమ్‌కు ఇంకా ఎనిమిది వారాల సమయం ఉంది. ముక్కోణపు సిరీస్‌లో ఆడాలని ఆశిస్తున్నాను. కానీ ఇక ముందు ఎప్పటికీ ఆడలేనేమో.. అలా జరక్కూడదనే అనుకుంటున్నాను.
 
 నా శక్తిమేరా తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను. అలా అని వాస్తవ పరిస్థితిని విస్మరించలేం కదా. ఆసీస్ తరఫున ఒక్క మ్యాచ్‌కు దూరమైనా అది నా హృదయాన్ని బద్దలు చేస్తుంది. ఇంకా నాలో క్రికెట్ మిగిలే ఉంది. ఇక భారత్‌పై తొలి టెస్టు విజ యం మాకు చాలా ‘ప్రత్యేకమైంది’. మా కెరీర్ మొత్తం ఈ మ్యాచ్ గుర్తుండిపోతుంది. నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన టెస్టు ఇది’       
 - మైకేల్ క్లార్క్ (ఆసీస్ కెప్టెన్)
 

మరిన్ని వార్తలు