-

‘టెక్నికల్‌గా ఆ భారత్‌ లెజెండ్‌ చాలా స్ట్రాంగ్‌’

10 Apr, 2020 14:55 IST|Sakshi

న్యూఢిల్లీ: తన కెరీర్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లను చూసినా టెక్నికల్‌గా అత్యంత పటిష్టమైన ఆటగాడు మాత్రం ఒక్కడే ఉన్నాడని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ తెలిపాడు. తన హయాంలో బ్రియాన్‌ లారా, కుమార సంగక్కరా, రాహుల్‌ ద్రవిడ్‌, జాక్వస్‌ కల్లిస్‌లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు కాగా, ఇక్కడ భారత దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ మాత్రం చాలా స్పెషల్‌ అని క్లార్‌ పేర్కొన్నాడు. ద్రవిడ్‌, సంగక్కరా, బ్రియాన్‌ లారాలు తమ ఆట తీరుతో ప్రత్యర్థి జట్లకు సవాల్‌ విసిరినప్పటికీ, సచిన్‌ మాత్రం చాలా కఠినమైన బ్యాట్స్‌మన్‌ అని క్లార్క్‌ చెప్పుకొచ్చాడు. సాంకేతికంగా తాను చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ మాత్రం సచిన్‌ ఒక్కడేనన్నాడు.(‘అలాంటి అవసరం మాకు లేదు’ )

‘సచిన్‌ను ఔట్‌ చేయాలంటే అంత ఈజీగా ఉండేది కాదు. టెక్నికల్‌గా సచిన్‌ చాలా స్ట్రాంగ్‌. అతను ఏమైనా పొరపాటు చేసి వికెట్‌ సమర్పించుకోవాలి తప్పితే ఎవ్వరికీ తేలిగ్గా లొంగేవాడు కాదు. సచిన్‌ తప్పులు చేసేలా బంతులు వేసి బౌలర్లు పైచేయి సాధించేవారి తప్పితే, సాంకేతికంగా చూస్తే అతని కంటే బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ను ఇప్పటివరకూ నేను చూడలేదు. నాకు తెలిసి సచిన్‌ను టెక్నికల్‌గా గమనిస్తే బలహీనతలు ఏమీ కనబడేవికావు. నా వరకూ సచిన్‌ అందరికంటే అత్యుత్తమం’ అని క్లార్క్‌ పేర్కొన్నాడు. ప్రస్తుత శకంలో అన్ని ఫార్మాట్ల పరంగా చూస్తే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అని స్పష్టం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనకంటూ ఒక మార్కును సంపాదించుకున్న కోహ్లి.. టెస్టు క్రికెట్‌లో కూడా తన జోరును కొనసాగిస్తుండటమే ఇందుకు ఉదాహరణగా క్లార్క్‌ తెలిపాడు. అయితే సచిన్‌, కోహ్లిల్లో సాధారణంగా కనిపించే లక్షణాల్లో భారీ సెంచరీలు చేయడాన్ని ఎక్కువగా ఆస్వాదించడమే వారిలో ప్రధానంగా కనబడే విషయమన్నాడు. (మా దగ్గర సరిపడా డబ్బు ఉంది! )

మరిన్ని వార్తలు