ఈ పురస్కారం నమ్మలేకున్నా : క్లార్క్‌

9 Jun, 2020 00:07 IST|Sakshi

సిడ్నీ: ఆసీస్‌ ప్రపంచకప్‌ విజయ సారథి మైకేల్‌ క్లార్క్‌ ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఇది మన భారత్‌లో పద్మ పురస్కారాల్లాగే ఆస్ట్రేలియాలో ఇచ్చే అవార్డు. క్రికెట్‌కు అందించిన విశేష సేవలకుగాను క్లార్క్‌కు ఈ పురస్కారం దక్కింది. ఆసీస్‌లో ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’ అనేది ఆ దేశ మూడో అత్యున్నత పురస్కారం. గతంలో దిగ్గజ క్రికెటర్లయిన అలెన్‌ బోర్డర్, బాబ్‌ సింప్సన్, స్టీవ్‌ వా, మార్క్‌ టేలర్,  రికీ పాంటింగ్‌లకు ఈ అవార్డు  లభించింది. క్లార్క్‌ 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌ను విజేతగా నిలిపాడు.

తాజాగా లభించిన హోదాపై క్లార్క్‌ మాట్లాడుతూ ‘నిజాయితీగా చెబుతున్నా... ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని నమ్మలేకున్నా. దీన్నెలా వర్ణించాలో మాటలు రావట్లేదు. ఈ అవార్డుతో ఆసీస్‌ దిగ్గజాలు, నేనెంతో అభిమానించే హీరోల సరసన నిలవడం చాలా సంతోషంగా ఉంది. అంతే గర్వంగా ఉంది. క్రికెట్‌ వల్లే ఇది సాకారమైంది’ అని అన్నాడు. టి20 ప్రపంచకప్‌పై అనుమానాలున్నప్పటికీ ఈ మెగా టోర్నీతోనే మళ్లీ తమ దేశంలో క్రికెట్‌ మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 39 ఏళ్ల క్లార్క్‌ తన కెరీర్‌లో 115 టెస్టులాడి 8643 పరుగులు చేశాడు. 245 వన్డేల్లో 7981 పరుగులు, 34 టి20ల్లో 488 పరుగులు చేశాడు. 

మరిన్ని వార్తలు