రాంచీలో కోహ్లీతోనే ముప్పు: మైకేల్ క్లార్క్

10 Mar, 2017 18:56 IST|Sakshi
రాంచీలో కోహ్లీతోనే ముప్పు: మైకేల్ క్లార్క్

రాంఛీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరును ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మైకేల్ క్లార్క్  ప్రశంసించాడు. కోహ్లీకి దూకుడే ప్రధాన ఆయుధమని, బలమని అభిప్రాయపడ్డాడు. అతడు తనకు నచ్చిన శైలిలో ఆడేందుకు సాధ్యమైనంతగా ప్రయత్నిస్తాడని, ఆ కారణాల వల్లనే కోహ్లీ విజయాలబాటలో నడుస్తున్నాడని  ఆసీస్ మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు. తొలి రెండు టెస్టుల్లో తన మార్క్ పరుగులు రాబట్టని భారత కెప్టెన్ మూడో టెస్టు (రాంచీ)లో ప్రమాదకారి కాగలడని ముఖ్యంగా ఆ విషయంపై దృష్టిసారించాలని ఆసీస్ బౌలర్లను హెచ్చరించాడు. డీఆర్ఎస్ విషయంలో తలెత్తిన డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ వివాదంలో తప్పంతా తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌దేనని చెప్పిన క్లార్క్.. ఈ విషయంలో విరాట్‌కే మద్దతుగా నిలిచాడు.

ఇప్పటికే గాయం కారణంగా ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ ఈ టెస్ట్ సిరీస్ కు దూరం కాగా, తాజాగా ఆ జట్టు ప్రధాన పేసర్ గాయం కారణంగా మిచెల్ స్టార్క్ కూడా సిరీస్ నుంచి వైదొలిగాడు. రాంఛీలో ఆసీస్ జట్టుకు కష్టకాలమేనని, స్టార్క్ లేకపోవడం జట్టుపై ప్రభావం చూపిస్తుందన్నాడు. స్టార్క్ కుడి కాలికి బెంగళూరు టెస్టులో గాయం కావడంతో మిగతా రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఇదివరకే తెలిపింది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో 1-1తో భారత్, ఆసీస్‌లు సమ ఉజ్జీగా ఉన్నాయి. దీంతో ప్రత్యర్ధిపై ఆధిప్యతం చెలాయించి సిరీస్‌ నెగ్గాలంటే మాత్రం మూడో టెస్టు ఇరు జట్లకు కీలకం కానుంది. అయితే సిరీస్ తమ జట్టుదేనని మైకేల్ క్లార్క్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు