చేపా చేపా ఎందుకు ఈదట్లేదు అంటే ... ఫెల్ప్స్తో ఓడిపోతాగా అందట

11 Aug, 2016 01:50 IST|Sakshi
చేపా చేపా ఎందుకు ఈదట్లేదు అంటే ... ఫెల్ప్స్తో ఓడిపోతాగా అందట

నీటికి, చేపకు మధ్య ఉన్న బంధం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు... కానీ అతడిని చూస్తే  మనిషికీ, నీళ్లకు మధ్య ఇంత స్వర్ణానుబంధం ఉంటుందా అనిపిస్తుంది. ఊర్లలో చెరువుల్లోనో, నదుల్లోకి నాణేలు వేసినప్పుడు లోపలికి దూకి వాటిని తీసుకొచ్చే ఈతగాళ్ల సరదా ఆటలను మనం చూస్తూనే ఉంటాం. మరి కొలనులోకి దిగితే చాలు కనీసం కనకంతోనే బయటికి వచ్చేవాడిని ఏమనాలి. పెద్ద చేపలు చిన్న చేపలను మింగేస్తాయంటారు...
 
  కానీ ఈ బంగారు చేప బరిలోకి దిగితే చాలు మిగతా చేపలంతా వినమ్రంగా పక్కకు తప్పుకొని దారి ఇస్తాయేమో. ఇదే గొప్పతనం మైకేల్ ఫెల్ప్స్‌ను జల క్రీడల్లో జగజ్జేతగా నిలిపింది. ఈతలో అలుపు, ఆయాసం అన్నదే రాకుండా పతకాలు అందుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచేలా చేసింది. ఒలింపిక్స్‌లో ఎన్నో దేశాలు ఒక్క స్వర్ణం గెలిస్తే చాలనుకునే చోట... అతను ఒక్కడే బంగారపు భోషాణంగా మారిపోయాడు. కొన్ని తరాల పాటు మరెవరూ కనీసం తాకేందుకు కూడా భయపడే కనకపు కీర్తిని అతను తన ఖాతాలో వేసుకున్నాడు.
 
 రియో డి జనీరో: ఈతకొలనులో అమెరికా దిగ్గజం మైకేల్ ఫెల్ప్స్ మళ్లీ మెరిశాడు. బుధవారం బరిలోకి దిగిన రెండు ఈవెంట్స్‌లోనూ స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నాడు. తన ఒలింపిక్స్ కెరీర్‌లో పసిడి పతకాల సంఖ్యను 21కు పెంచుకున్నాడు. ఓవరాల్‌గా ఫెల్ప్స్‌కిది 25వ ఒలింపిక్ పతకం. రియో ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్‌కు మరో రెండు ఈవెంట్స్ (100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే) మిగిలి ఉన్నాయి.
 
 రియో ఒలింపిక్స్ కోసమని రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పునరాగమనం చేసిన ఈ అమెరికా స్టార్ అనుకున్నది సాధించాడు. తనకెంతో ఇష్టమైన 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్‌లో స్వర్ణాన్ని హస్తగతం చేసుకున్నాడు. 2004 ఏథెన్స్, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో పసిడి పతకాలు నెగ్గిన ఫెల్ప్స్... 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఈ కేటగిరీలో చాద్ లె క్లోస్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నాడు.
 
  రియో ఒలింపిక్స్‌లో ఎలాగైనా 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ స్వర్ణాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో రంగంలోకి దిగిన ఫెల్ప్స్ సఫలమయ్యాడు. ఫైనల్ రేసును ఫెల్ప్స్ ఒక నిమిషం 53.56 సెకన్లలో ముగించి విజేతగా నిలిచి తన ‘మిషన్’ పరిపూర్ణం చేశాడు. మసాటో సకాయ్ (జపాన్), తమాస్ కెండెర్సి (హంగేరి) రజత, కాంస్య పతకాలు నెగ్గారు. డిఫెండింగ్ చాంపియన్ చాద్ లె క్లోస్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక 4ఁ200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో సహచరులు కానర్ డ్వయర్, ఫ్రాన్సిస్ హాస్, రియాన్ లోచ్టెలతో కలిసి ఫెల్ప్స్ అమెరికా బృందానికి పసిడి పతకాన్ని అందించాడు. ఫెల్ప్స్ బృందం 7 నిమిషాల 00.66 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
 

మరిన్ని వార్తలు