ఓ దిగ్గజం విడ్కోలు

14 Aug, 2016 02:06 IST|Sakshi

రియో డి జనీరో: ప్రపంచ క్రీడా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. రికార్డు స్థాయిలో 22 స్వర్ణాలతో ఒలింపిక్స్ కొలనును ఉర్రూతలూగించిన అమెరికా దిగ్గజం మైకేల్ ఫెల్ప్స్ తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. 100 మీటర్ల బటర్ ఫ్లయ్ ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించిన అనంతరం అతను తన నిర్ణయాన్ని వెల్లడించాడు. రియో ఒలింపిక్స్‌తో కెరీర్ ముగిస్తున్నానని ఫెల్ప్స్ చెప్పాడు. గతంలోలాగా మరోసారి పునరాగమనం చేసే ఆలోచన అసలే లేదని, ఇదే తన తుది నిర్ణయమని అతను స్పష్టం చేశాడు. ‘ఈతతో 24 ఏళ్లుగా నాకు అనుబంధం పెనవేసుకుపోయింది. ఇన్నేళ్లలో నేను ఏది అనుకుంటే అది చేయగలిగాను. నా కెరీర్‌ను ముగిస్తున్న తీరు పట్ల గర్వంగా ఉన్నాను. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మానసికంగా మరింత దృఢంగా ఉన్న స్థితిలో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా సహచరి నికోల్, కొడుకు బూమర్‌తో మరింత సమయం గడపాల్సి ఉంది’ అని ఫెల్ప్స్ వ్యాఖ్యానించాడు.
 
 అత్యద్భుత కెరీర్...
 31 ఏళ్ల ఫెల్ప్స్ తొలి సారి 15 ఏళ్ల వయసులో సిడ్నీ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. 200 మీటర్ల బటర్ ఫ్లయ్ ఈవెంట్‌లో ఐదో స్థానంతో అతని పోరాటం ముగిసింది. అయితే ఆ తర్వాత ఏథెన్స్‌తో మొదలు పెట్టి తాజాగా రియో వరకు అతను నాలుగు ఒలింపిక్స్‌లో కలిపి 27 పతకాలు కొల్లగొట్టాడు. ఇందులో ఏకంగా 22 స్వర్ణాలతో ఆల్‌టైం గ్రేట్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్, పాన్ అమెరికా చాంపియన్‌షిప్ పోటీలు కలిపి అంతర్జాతీయ స్థాయిలో 65 స్వర్ణాలు సహా 81 పతకాలు గెలుచుకోవడం విశేషం.  2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించినా మరో రెండేళ్లకు తిరిగొచ్చి మళ్లీ స్విమ్మింగ్‌పై తనదైన ముద్ర వేసిన ఈ లెజెండ్ ఇప్పుడు పూర్తిగా ఈతకు దూరమవుతున్నాడు.
 
 చివరిగా ఒక్కసారి
 ఫెల్ప్స్ రిటైర్మెంట్ ప్రకటించినా... ఆదివారం ఉద యం (భారత కాలమానం ప్రకారం గం.7.34ని) అతడిని ఆఖరిసారిగా కొలనులో చూడవచ్చు. పురుషుల 4x100 మీ. మెడ్లే రిలేలో అతను పాల్గొనబోతున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో అమెరికా ఎన్నడూ ఓడని ఈ ఈవెంట్‌లో కూడా పతకం గెలిస్తే ఫెల్ప్స్ మొత్తం 28 పతకాలతో ముగిస్తాడు. లేదంటే 27తో సరి.
 
 డియర్ ఫెల్ప్స్...

 సగటు భారత క్రీడాభిమానులుగా మాకు స్విమ్మింగ్ గురించి పెద్దగా తెలియదు. ప్రతి నాలుగేళ్లకు ఓసారి ఒలింపిక్స్ పుణ్యమాని ఈ ఆటను చూస్తున్నాం. నిజానికి ఒలింపిక్స్‌లో ఇంకా చాలా ఆటలు ఉన్నా... స్విమ్మింగ్‌ను ఎక్కువగా ఫాలో అవుతున్నాం. దీనికి కారణం నువ్వు. ఈతలో ఇన్ని రకాలు ఉంటాయని కూడా మాలో చాలామందికి తెలియదు. ఫ్రీ స్టయిల్, బటర్‌ఫ్లయ్ , మెడ్లే... ఇలా విభిన్నమైన ఆటలు ఉంటాయని తెలుసుకోవడానికి కారణం కూడా నువ్వే. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో తొలిసారి నువ్వు ఆరు స్వర్ణాలు గెలిచినప్పుడు ప్రపంచం అబ్బురపడింది. స్విమ్మింగ్‌లో ఓ స్టార్  ఉంటాడని మాకూ తెలిసింది.
 
 ఆ తర్వాత 2008లో బీజింగ్‌లో ప్రతి రోజూ ఓ స్వర్ణం చొప్పున ఎనిమిది స్వర్ణాలు గెలిచావని తెలిసినప్పుడు... ‘మనిషేనా..’ అనే సందేహం కలిగింది. ఇక లండన్‌లో నాలుగు స్వర్ణాలు మాత్రమే గెలిచినప్పుడు నీ జోరు తగ్గిపోయిందేమో అనుకున్నాం. ఆ ఒలింపిక్స్‌తో ఆటకు వీడ్కోలు చెప్పావని తెలిసినప్పుడు రెండు రకాల స్పందనలు. ఒకటి... మళ్లీ ఇలాంటి దిగ్గజాన్ని చూడలేమేమో అనే బాధ. మరొకటి... వచ్చే ఒలింపిక్స్‌లో కొత్త వాళ్లకు అవకాశం వస్తుందనే ఆశ కూడా కలిగింది. కానీ రెండేళ్ల క్రితం నువ్వు రిటైర్‌మెంట్‌ను విరమించుకున్నావ్. ఆ క్షణంలో నువ్వు మళ్లీ పాత ఫెల్ప్స్‌లా ఈదుతావనే నమ్మకం మాత్రం లేదు. రెండేళ్లు విరామం తీసుకున్న వ్యక్తి తిరిగి ఈత కొలనులో అంత చురుగ్గా కదలడం అసంభవమనే మాటా వినిపించింది.
 
 ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత ప్రమాణాలతో పోటీలు జరిగే చోట మళ్లీ స్వర్ణాలు గెలుస్తాడా..? ఏమో చూద్దాం అని వేచి చూశాం. రెండేళ్ల పాటు నీ గురించి పెద్దగా వార్తలు, విశేషాలు లేవు. పైగా మద్యం తాగి కారు నడుపుతూ శిక్షకు గురవడం లాంటి సంఘటనల వల్ల ఏదో మూల చిన్న అనుమానం. కానీ రియోలో బరిలోకి దిగగానే అర్థమైపోయింది... ఫెల్ప్స్‌లో జోరు ఏమాత్రం తగ్గలేదని. పోటీ పడ్డ ప్రతి ఈవెంట్‌లో స్వర్ణం గెలవడం ఏంటసలు..? మానవమాత్రులకు ఇది ఎలా సాధ్యం. మాకు స్వాతంత్య్రం రాక ముందు నుంచీ 116 ఏళ్ల క్రీడల చరిత్రలో 26 పతకాలు వస్తే... నీకు 16 ఏళ్లలో 27 పతకాలు ఎలా వచ్చాయబ్బా..?  కాస్త నీ సీక్రెట్స్ మా వాళ్లకు చెప్పి పుణ్యం కట్టుకోరాదు.
 
 చిన్నప్పుడు నీకు ఏ విషయం ఎక్కువసేపు గుర్తుండేది కాదని విన్నాం. మరి గజినీలా ఈతను మాత్రం ఎందుకు మరచిపోలేదో..! నీ వల్ల అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది మాత్రం నీ సహచరుడు, స్నేహితుడు లోచే. తాను స్వర్ణం గెలుస్తాడని ఆశించిన ప్రతిసారీ నువ్వు గెలుస్తుంటివాయె..! ప్రతిసారీ రజతంతో సరిపెట్టుకుంటున్నాడు పాపం. మెడల్ అందుకోవడానికి వచ్చి నీ పక్కన నిలుచుని వెండి పతకం అందుకుంటూ నవ్వుతున్నాడుగానీ... పాపం లోపల ఎంత కుమిలిపోతున్నాడో. నాలుగేళ్ల క్రితం నువ్వు రిటైర్‌మెంట్ ప్రకటించినప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అతనే సంబరపడి ఉంటాడు. ఏదో టీమ్ ఈవెంట్లలో మాత్రం నీతో కలిసి స్వర్ణం అందుకుంటున్నాడు. రియోలో కూడా తన స్వర్ణ ఆశలను ఆవిరి చేస్తివి. మా దగ్గర రెండు దశాబ్దాల పాటు సచిన్ ధాటికి గొప్ప గొప్ప క్రికెటర్లు కూడా రెండో స్థానానికి పరిమితమైనట్లు... స్విమ్మింగ్‌లో నీ దెబ్బకి లోచే కూడా అలాగే అయిపోయాడు పాపం.
 
 అదేదో సినిమాలో మా బ్రహ్మానందం చెప్పినట్లు ‘క్రియేటర్స్‌కి కూడా ఎమోషన్స్ ఉంటాయ్’.. అని రియోలో నువ్వూ చూపించావ్. 200మీటర్ల బటర్‌ఫ్లై స్వర్ణం గెలవగానే పరిగెడుతూ వెళ్లి నీ బిడ్డను ముద్దాడిన దృశ్యం చెప్పింది... నువ్వెంత కసిగా మెడల్స్ కోసం రియోకు వచ్చావో అని. ఏమైనా నీ ఈత మాకు వినోదం. నీ రికార్డులు మాకు లక్ష్యాలు. నీ పతకాలు మాకు స్ఫూర్తి... మాకే కాదు... క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే ఏ దేశస్తుడైనా ముందు నీ గురించి తెలుసుకోవాలి. ఒక మనిషి ఇంత పెద్ద పెద్ద ఘనతలు సాధించడం సాధ్యమే అనే విశ్వాసం రావాలంటే నీ కథ చదవాలి. ఇక నిన్ను ఈత కొలనులో చూసే అవకాశం లేదని ఓ వైపు బాధగా ఉన్నా... ఇలాంటి గొప్ప అథ్లెట్ ఘనతలకు సాక్షులుగా నిలిచామని సంతృప్తిగా ఉంది. ఒలింపిక్స్ క్రీడా సంరంభం ఉన్నంతకాలం నీ పేరు ఉంటుంది. చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. గుడ్‌బై ఫెల్ప్స్.
 - సగటు భారత క్రీడాభిమాని
 
ఫెల్ప్స్‌ను కొట్టిన మొనగాడు..!
 21 ఏళ్ల స్కూలింగ్ సంచలనం  x 100 మీటర్ల బటర్ ఫ్లయ్‌లో స్వర్ణపతకం
 ఎనిమిదేళ్ల క్రితం ఆ కుర్రాడు తాను కూడా స్విమ్మింగ్ స్టార్ ఫెల్ప్స్‌లా కావాలనుకున్నాడు. అతని ఘనతలనే స్ఫూర్తిగా తీసుకొని సాధన చేశాడు. నాడు ఫెల్ప్స్‌తో కలిసి దిగిన ఫోటోను అపురూపంగా దాచుకున్నాడు. ఇప్పుడు రెండు ఒలింపిక్స్‌లు ముగిసే సరికి తన అభిమాన స్విమ్మర్‌నే ఓడించే స్థాయికి చేరుకున్నాడు.

21 ఏళ్ల ఆ సింగపూర్ సంచలనం పేరు జోసెఫ్ స్కూలింగ్. 100 మీటర్ల బటర్ ఫ్లయ్  ఈవెంట్‌లో సత్తా చాటిన స్కూలింగ్ (50.39 సెకన్లు) అగ్ర స్థానంతో స్వర్ణ పతకం సాధించాడు. ఈత కొలనులో ఎదురు లేకుండా సాగుతున్న ఫెల్ప్స్‌కు అతను షాకిచ్చాడు. 22 స్వర్ణాలతో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన ఫెల్ప్స్‌ను కూడా ఓడించేవాడు ఒకడు ఉన్నాడని స్కూలింగ్ నిరూపించాడు. తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన స్విమ్మర్ నుంచి తనకు ఎదురైన పోటీకి స్వయంగా అమెరికా దిగ్గజం కూడా అచ్చెరువొందాడు. చివరకు ఫెల్ప్స్ రజతం (51.14 సె.)తో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. మరో ఇద్దరికి కూడా రజతం అందించారు. గతంలో 1969లో మాత్రమే ఇలా ఒకే టైమింగ్‌తో ముగ్గురు రజతాలు గెలుచుకున్నారు.
 

మరిన్ని వార్తలు