ఈసారి కప్‌ న్యూజిలాండ్‌దే.. ఏమంటావు?

12 Jul, 2019 11:34 IST|Sakshi

1992 వరల్డ్‌కప్‌ తర్వాత ఆరు టోర్నీలలో ఒక్కసారి కూడా సెమీస్‌ చేరలేకపోయిన ఇంగ్లండ్‌ ఇప్పుడు సొంతగడ్డపై ఎట్టకేలకు తుదిపోరుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్ ఆస్ట్రేలియాపై గెలుపొందిన ఆతిథ్య జట్టు 44 ఏళ్ల తమ టైటిల్‌ కలను నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. తమ చిరకాల ప్రత్యర్థి ఆసీస్‌ను చిత్తు చేసిన మోర్గాన్‌ సేన టైటిల్‌ సాధించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో టీమిండియాను ఓడించిన జట్టే వరల్డ్‌కప్‌ను ఎగరేసుకుపోతుందని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు..  ‘ ఇండియాను ఎవరైతే ఓడిస్తారో వాళ్లే ప్రపంచకప్‌ గెలుస్తారు’ అని అతడు చేసిన ట్వీట్‌ క్రికెట్‌ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది.

ఈ క్రమంలో మైఖేల్‌ ట్వీట్‌పై స్పందించిన భారత అభిమానులు...‘ మీరు చెప్పిన దాన్ని బట్టి వరల్డ్‌ కప్‌ చాంపియన్‌ కంటే టీమిండియానే అత్యుత్తమ జట్టు అని స్పష్టమవుతోంది అని చమత్కరిస్తుండగా.. .‘ ఫైనలిస్టుల చేతిలో ఇండియా ఓడిపోయింది. ఆ రెండు జట్లను పాకిస్తాన్‌ ఓడించింది. అంటే అన్ని జట్ల కంటే పాక్‌ చాలా గొప్పగా ఆడినట్లు’ అని దాయాది జట్టు ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం.. మైఖేల్‌ అసలు నీ ట్వీట్‌లో ఏమైనా లాజిక్‌ ఉందా అని ప్రశ్నిస్తుండగా... మరికొంత మంది.. ‘ 2015 సెమీస్‌ ఫలితాన్నిబట్టి మైఖేల్‌ ఇలా చెబుతున్నారేమో. అంటే ఆనాడు కూడా టీమిండియా సెమీ ఫైనల్‌లో ఓడిపోయింది. వాళ్లపై నెగ్గిన ఆసీస్‌ కప్‌ ఎగురేసుకుపోయింది. దీన్ని బట్టి ఈసారి కప్‌ న్యూజిలాండ్‌దే. ఏమంటావు మైఖేల్‌’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా మెగాటోర్నీలో భాగంగా బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన తొలి ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తొలి సెమీస్‌ మ్యాచ్‌లో అనూహ్యంగా న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇక గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై జయకేతనం ఎగురవేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగుల వద్ద ఆలౌటైంది. స్మిత్‌ (119 బంతుల్లో 85; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్రిస్‌ వోక్స్‌ ప్రత్యర్థిని దెబ్బతీశాడు. లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 32.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్‌ జేసన్‌ రా య్‌ (65 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించాడు. మోర్గాన్‌ (39 బంతుల్లో 45 నాటౌట్‌), రూట్‌ (46 బంతుల్లో 49 నాటౌట్‌; 8 ఫోర్లు) రాణించారు.

>
మరిన్ని వార్తలు