ఫెర్గుసన్‌కు గాయం.. వాన్‌ కొత్త ప్రతిపాదన

13 Dec, 2019 19:05 IST|Sakshi

పెర్త్‌: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న తొలి మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్‌ జట్టును కష్టాలు వెంబడిస్తున్నాయి. తొలి రోజు ఆటలో భాగంగా కివీస్‌ పేస్‌ బౌలర్‌ ఫెర్గుసన్‌ కాలికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. కేవలం 11 ఓవర్లు వేసిన అనంతరం ఫెర్గుసన్‌ మైదానం వీడటంతో ఒక బౌలర్‌ లోటుతోనే కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను గట్టెక్కించింది. ఫెర్గుసన్‌ గాయం తీవ్రత దృష్ట్యా అతడు తొలి టెస్టులో బౌలింగ్‌ చేయకపోవడమే మంచిదని అయితే బ్యాటింగ్‌కు దిగొచ్చని డాక్టర్లు పేర్కొన్నట్లు కివీస్‌ క్రికెట్‌ బోర్డు తొలుత ఓ ప్రకటన చేసింది. అనంతరం ఫెర్గుసన్‌కు తొలి టెస్టుకు విశ్రాంతి నివ్వడమే మంచిదని డాక్డర్లు సూచించినట్లు మరో ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫెర్గుసన్‌ గాయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. 

అయితే ఫెర్గుసన్‌ మైదానంలోకి దిగినా బౌలింగ్‌ చేసే అవకాశమే లేదని కివీస్‌ బోర్డు నిర్దారణకు వచ్చింది. దీంతో ఒక బౌలర్‌ లోటు తోనే తొలి టెస్టును నెట్టుకురావాల్సిన పరిస్థితి విలియమ్స్‌ సేనకు ఏర్పడింది. అయితే ఈ సందర్భంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాడు. మిగతా నాలుగు రోజులు కివీస్‌ ఒక ప్రధాన బౌలర్‌ సేవలను కోల్పోనుందని, ఇది ఏ జట్టుకైన ఇబ్బందేనని పేర్కొన్నాడు. అయితే ఇలాంటి తరుణంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ మాదిరిగానే ‘ఇండిపెండెంట్‌ డాక్టర్‌ ఆన్‌ సైట్‌’ అనే ప్రతిపాదనను ఐసీసీ ముందుంచాడు. మ్యాచ్‌ సందర్భంగా ఆటగాడు గాయపడితే మైదానంలో ఉన్న నియమిత డాక్టర్‌ అతడిని పరీక్షించిన అనంతరం ఆ క్రికెటర్‌ మ్యాచ్‌ ఆడే వీలులేదని ప్రకటిస్తే మరో ఆటగాడిని జట్టులోకి తీసుకునే వెసులుబాటును కల్పించాలన్నాడు. దీంతో ఏ జట్టు నష్టపోదని వాన్‌ అభిప్రాయపడుతున్నాడు. మరి ఈ ప్రతిపాదనపై క్రికెట్‌ దేశాలు, ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాలి.

మరిన్ని వార్తలు