క్లార్క్‌ తుస్సుమనిపించేశాడు

8 Apr, 2018 11:45 IST|Sakshi

సాక్షి, ముంబై : స్మిత్‌, వార్నర్‌లపై వేటు వ్యవహారంతో ఆస్ట్రేలియా జట్టు ఢీలా పడిపోయింది. ఈ దశలో జట్టుకు నైతిక బలం ఇచ్చేలా మాజీ ఆటగాడు మైకేల్‌ క్లార్క్‌ బంపరాఫర్‌ ప్రకటించాడన్న వార్త ఒకటి చక్కర్లు కొట్టింది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటే తాను తిరిగి మైదానంలోకి దిగుతానని క్లార్క్‌ చెప్పినట్లు సిడ్నీ సండే టెలిగ్రాఫ్‌ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఐపీఎల్‌ కోసం భారత పర్యటనలో ఉన్న క్లార్క్ ఆ కథనంపై స్పందించాడు. ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని ట్విటర్‌లో ప్రకటించాడు.

‘జట్టుకు తిరిగి ఆడతానని నేనేం ఆహ్వానం పంపలేదు. ఆ కథనం నిజంకాదు. క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ జేమ్స్‌ సుథర్‌ల్యాండ్‌కు ఓ స్నేహితుడిగా సందేశం పంపాను. అవసరమైతే జట్టుకు ఏ రూపంలో అయినా సాయం అందిస్తానని చెప్పాను. అంతేగానీ తిరిగి ఆడతానని నేను అనలేదు’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఆసీస్‌ జట్టు టెస్ట్‌ ర్యాంక్‌ కోల్పోవటంపై స్పందిస్తూ.. ‘ఆస్ట్రేలియా పరిస్థితి.. వెస్టిండీస్‌లాగా మారాలని నేను కోరుకోవటం లేదు. తొందర్లోనే తిరిగి పుంజుకుంటుందని ఆశిస్తున్నా’ అని మాత్రం తాను చెప్పినట్లు క్లార్క్‌ వెల్లడించాడు.

37 ఏళ్ల మైకేల్‌ క్లార్క్‌ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. మొత్తం 245 వన్డేలు, 115 టెస్టులు, 34 టీ20లు అడిన అనుభవం క్లార్క్‌ సొంతం. 2015లో రిటైర్‌మెంట్‌ ప్రకటించిన అనంతరం కామెంటేటర్‌ అవతారం ఎత్తాడు. 

మరిన్ని వార్తలు