చివర్లో కన్నీళ్లు తెప్పించారు: మికీ ఆర్థర్

10 Jun, 2016 19:39 IST|Sakshi
చివర్లో కన్నీళ్లు తెప్పించారు: మికీ ఆర్థర్

లాహోర్: గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కోచ్ గా పని చేసిన తాను కొన్ని చేదు జ్ఞాపకాలతోనే ఆ పదవి నుంచి వైదొలిగినట్లు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మికీ ఆర్థర్ స్పష్టం చేశాడు. తాను ఆస్ట్రేలియా కోచ్గా చేసిన తొలి రెండు సంవత్సరాలు అద్భుతం సాగితే, చివర్లో మాత్రం కన్నీళ్లతోనే కోచ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నాడు. తన కాంట్రాక్ట్ 2015 వన్డే వరల్డ్ కప్ వరకూ ఉన్నా, 2013లోనే అర్థాంతరంగా తనపై వేటుపడటం తీవ్రంగా బాధించిందని మికీ ఆర్థర్ తెలిపాడు. 

యాషెస్ సిరీస్ కు ముందు ఆటగాళ్లతో సఖ్యత లేదనే కారణం చూపుతూ తనను తొలగించారన్నాడు. అసలు ఏమి జరిగింది అనేది పక్కను పెడితే, తనకు ఉద్వాసన పలికిన తీరు మాత్రం కన్నీళ్లను తెప్పించిందన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోచ్గా ఉన్న తాను ఇటువంటి అనుభవాన్ని కోరుకోవడం లేదన్నాడు. కనీసం రెండు సంవత్సరాల పాటు పాకిస్తాన్ జట్టుకు కోచ్ పని చేయాలని కోరుకుంటున్నట్లు ఆర్థర్ పేర్కొన్నాడు. కోచ్ గా సరైన మార్గంలో వెళితే, మంచి ఫలితాలు అవే వస్తాయని ఆర్థర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తాము త్వరలో చేపట్టబోతున్న ఇంగ్లండ్ పర్యటనలో పాక్ ప్రధాన పేసర్ మొహ్మద ఆమిర్ రాణిస్తాడని ఆర్థర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

గతంలో దక్షిణాఫ్రికా కోచ్ గా పని చేసిన ఆర్థర్.. 2010లో ఆ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేశాడు. అనంతరం ఆస్ట్రేలియా కోచ్గా ఐదు సంవత్సరాలు ఒప్పందం చేసుకున్నా, 2013 జూన్ నెలలో ఆర్థర్ ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తప్పించడంతో అప్పట్లో దుమారం రేపింది.

మరిన్ని వార్తలు