న్యూజిలాండ్‌ మాకోసం గెలుస్తుంది : పాక్‌ కోచ్‌

3 Jul, 2019 11:46 IST|Sakshi

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో దాయాది జట్టు పాకిస్తాన్‌కు సెమీస్‌ అవకాశాలు సన్నగిల్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ తదుపరి మ్యాచ్‌లో ఆ జట్టు గెలుపొందినా.. బుధవారం జరిగే ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పాక్‌ను దెబ్బతీసేందుకే టీమిండియా.. ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయిందని పాక్‌ మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన క్రీడానీతి పాటించలేదంటూ పాక్‌ దిగ్గజ ఆటగాడు వకార్‌ యూనిస్‌ మండిపడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నేడు ఆతిథ్య జట్టుతో తలపడనున్న కివీస్‌ తమ కోసం గెలిచితీరుతూందంటూ పాక్‌ జట్టు కోచ్‌ మిక్కీ ఆర్థర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘వాళ్లు(ఇండియా) ఎలా ఆడాలన్న విషయాన్ని మేము కంట్రోల్‌ చేయలేం కదా. ఫలితం కోసం ఆ మ్యాచ్‌ ఆసాంతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాం. మెగాటోర్నీలో నిలవాలంటే మాకు ముఖ్యమైన మ్యాచ్‌లో  టీమిండియా ఓడిపోవడం నిరాశ కలిగించింది. మాకోసం న్యూజిలాండ్‌ జట్టు గెలిచితీరుతుందని భావిస్తున్నా. ఒకవేళ ఆ జట్టు గనుక ఓడిపోయి.. ఇంగ్లండ్‌ భారీ తేడాతో గెలుపొందితే మా నెట్‌రన్‌ రేటుపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది కాస్త కష్టంతో కూడుకున్నదే’  అని ఆర్థర్‌ పేర్కొన్నాడు. ఇక మెగాటోర్నీలోని తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఘోర ఓటమి తనను ఇప్పటికీ వెంటాడుతుందని విచారం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ సానుకూల దృక్పథంతో విజయాలు సాధించామని చెప్పుకొచ్చాడు.

కాగా ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు తమ చివరి మ్యాచ్‌ వరకు శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌లో అడుగుపెట్టేందుకు మోర్గాన్‌ సేన నేడు (బుధవారం) జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత్‌పై విజయంతో కోలుకున్న ఇంగ్లండ్‌... ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే 12 పాయింట్లతో సెమీస్‌ చేరుకుంటుంది. ఒక వేళ ఓడితే మాత్రం పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోతే.. పాక్‌ సెమీస్‌ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ బంగ్లా చేతిలో పాక్‌ ఓడిపోతే.. ఇంగ్లండ్‌కు అవకాశాలు ఉంటాయి.

మరిన్ని వార్తలు