కోహ్లి.. అక్కడ ఒక్క సెంచరీ చేయలేడు..!

7 Feb, 2018 13:13 IST|Sakshi
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (ఫైల్ ఫొటో)

కరాచీ: ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకడని చెప్పవచ్చు. వన్డేల్లో ఇప్పటికే 33 శతకాలు చేసిన కోహ్లికి.. సచిన్ 49 శతకాల రికార్డును బద్ధలు కొట్టడం అంత కష్టమేమీ కాదు. కానీ కోహ్లికి తమ దేశంలో సెంచరీ ఎప్పటికీ కలేనని, అతడు ఇక్కడ ఒక్క శతకం కూడా బాదలేడని పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మికీ ఆర్థర్ అంటున్నాడు. 

కోహ్లి ఆట గురించి మికీ ఆర్థర్ కొన్ని విషయాలు ప్రస్తావించాడు. 'భారత క్రికెటర్ కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మెనే కానీ అతడు పాకిస్తాన్‌ గడ్డమీద పాక్ జట్టుపై సెంచరీ మాత్రం చేయలేడు. ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డమీద సఫారీలపై తొలి శతకం చేశాడు. అయితే పాక్‌లో మాత్రం కోహ్లికి మా బౌలర్లు అంత అవకాశం ఇవ్వరు. ఇక్కడ ఒత్తిడిని ఎదుర్కొని సెంచరీ చేయడం కోహ్లికి అంత సులభం కాదని' పాక్ కోచ్ ఆర్థర్ అభిప్రాయపడ్డాడు. 

మరోవైపు కోహ్లికి పాక్‌ జట్టు మీద మంచి రికార్డు ఉంది. 12 వన్డేల్లో పాక్‌పై రెండు సెంచరీల సాయంతో 45.90 సగటుతో 459 పరుగులు చేశాడు. 6 టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లి 84.66 సగటుతో 254 పరుగులు సాధించాడు. పాక్‌తో ఇప్పటివరకూ కోహ్లి ఒక్క టెస్ట్ మ్యాచ్‌ కూడా ఆడలేదు. టీమిండియా సీనియర్ క్రికెటర్లు ఎంఎస్ ధోని, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, దినేశ్ కార్తీక్ లాంటి కొందరికి మాత్రమే పాక్‌ గడ్డమీద, లేదా పాక్ జట్టుతో టెస్టులు ఆడిన అనుభవం ఉంది.

2007-08 సీజన్ తర్వాత పాక్-భారత్ ద్వైపాక్షిక వన్డే, టెస్ట్ సిరీస్‌లు ఆడలేదు. కానీ, అతికష్టమ్మీద చివరగా 2012-13లో పొట్టి ఫార్మాట్‌లో దాయాది జట్ల మధ్య భారత్‌లో ఓ సిరీస్ నిర్వహించారు.

మరిన్ని వార్తలు