పాలబ్బాయి కొడుకు.. వరల్డ్ చాంపియన్

18 Sep, 2016 14:20 IST|Sakshi
పాలబ్బాయి కొడుకు..వరల్డ్ చాంపియన్

బిలిసి(జార్జియా): దీపక్ పూనియా.. ఇప్పటివరకూ ప్రపంచానికి పెద్దగా తెలియన పేరు. భారత్ కు చెందిన ఈ 17 ఏళ్ల కుర్రాడు ఇప్పడు ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. బిలిసిలో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో దీపక్ పూనియా విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పసిడి పతకపోరులో భాగంగా 85 కేజీల హెవీ వెయిట్ కేటగిరిలో దీపక్ 9-5 తేడాతో టర్కీకి చెందిన నెయిల్ సెయ్యార్ను ఓడించి యావత్ భారత జాతిని ఆకర్షించాడు. అయితే హర్యానా రాష్ట్రానికి చెందిన దీపక్.. ఒక చిరు పాల వ్యాపారి కొడుకు.


స్కూల్ డేస్ నుంచి దీపక్ పతకాల వేటలో ఎప్పుడూ ముందుండే వాడు. ఎక్కడ ఈవెంట్ జరిగిన పాల్గొని ఇంటికి పతకంతోనే తిరిగొచ్చేవాడు. కాగా, సుమారు పది సంవత్సరాల పాటు అఖడ గ్రామంలో శిక్షణ తీసుకున్న దీపక్.. 2015లో అత్యుత్తమ శిక్షణ కోసం న్యూఢిల్లీ చేరుకున్నాడు. అక్కడ చతర్సాల్ స్టేడియంలో సప్తల్ సింగ్ మార్గదర్శకత్వంలో, కోచ్ సుశీల్ కుమార్ పర్యవేక్షణలో కొంత కాలం శిక్షణ పొందాడు.  



అయితే హెవీ వెయిట్ రెజ్లర్ కావాలనుకున్న దీపక్కు అక్కడ స్వల్ప ఇబ్బందులు రావడమే ఇంటికి తిరిగి వచ్చేసినట్లు దీపక్ పేర్కొన్నాడు. ప్రధానంగా తాను ఎప్పుడూ ఆవు పాలనే ఇష్టపడేవాడినని, ఢిల్లీలో గేదె పాలు మాత్రమే లభించడంతో తిరిగి ఇంటికి వచ్చినట్లు దీపక్ తెలిపాడు.

తండ్రికి మాటిచ్చాడు..

గత నెల్లో ఫ్రాన్స్లో జరిగిన జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో దీపక్ ఒట్టి చేతుల్తో ఇంటికి వచ్చాడు. దీంతో అతనికి ఇష్టమైన ఆవు పాలకు కూడా దీపక్ దూరమయ్యాడు. కొడుకు పతకం తేలేదన్న కోపంతో దీపక్కు తండ్రి ఆవు పాలను ఇవ్వడం మానేశాడు. అయితే సెప్టెంబర్ రెండో వారంలో బిలిషి విమానం ఎక్కేముందు తండ్రికి మాటిచ్చాడు. ఈసారి పతకం తేకుండా ఇంటికి రానన్నాడు. దాన్ని సాకారం చేసుకోవడమే కాదు.. పసిడితో మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. 85 కేజీల హెవీ వెయింట్ కేటగిరిలో వరల్డ్ టైటిల్ గెలిచిన  తొలి భారతీయుడిగా రికార్డు పుస్తకాల్లో ఎక్కాడు.

మరిన్ని వార్తలు