ఆ వికెటే టర్నింగ్ పాయింట్‌: అమిత్‌ మిశ్రా

16 Apr, 2016 10:28 IST|Sakshi
ఆ వికెటే టర్నింగ్ పాయింట్‌: అమిత్‌ మిశ్రా

న్యూఢిల్లీ: అనుభవానికి నైపుణ్యం జోడించి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించాడు లెగ్ స్పిన్నర్ అమిత్‌ మిశ్రా. గింగిరాలు తిరిగే తన బౌలింగ్‌తో విదేశీ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన అమిత్‌.. పంజాబ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ వికెట్‌ను పడగొట్టడం మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్‌ అని, అతని వికెట్ పడటంతో మిగతా బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడిలో కూరుకుపోయారని అభిప్రాయపడ్డాడు.

అద్భుతమైన బౌలింగ్‌తో అమిత్‌ మిశ్రా నాలుగు వికెట్లు తీయడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కింగ్స్ ఎలెవన్‌ 111 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఢిల్లీ తొలి విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ బౌలర్‌ అమిత్ మాట్లాడుతూ 'మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. కొన్ని వీడియోలు కూడా చూశాను. పంజాబ్ బ్యాట్స్‌మెన్ భారీ షాట్లకు ప్రయత్నిస్తే.. వారిని ఎలా పెవిలియన్‌కు పంపాలనే దానిపై కెప్టెన్ జాక్‌ (జహీర్ ఖాన్‌)తోనూ చర్చించాను. ఆ వ్యూహాలు ఫలించడం ఆనందంగా ఉంది' అని చెప్పాడు. ఈ ప్రదర్శన ద్వారా వందో మ్యాచ్‌లో పర్పుల్‌ క్యాప్‌ పొందడం ఆనందంగా ఉందని తెలిపాడు. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగా తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అమిత్‌ మిశ్రా చరిత్ర సృష్టించాడు. తద్వారా పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

బాడీ లాంగ్వెజ్ ఆధారంగా బ్యాట్స్‌మెన్‌ భారీ షాట్లకు దిగుతారా? లేదా? అన్నదానిపై ఫోకస్ చేశామని, అలాంటి డెలివరీస్‌లోనే తనకు వికెట్లు పడటం ఆనందంగా ఉందని చెప్పారు. అమిత్ మిశ్రా స్పిన్‌ బౌలింగ్‌ బాగా పడినప్పటికీ అతనికి ( 3-0-11-4) మూడు ఓవర్లు మాత్రమే లభించాయి. కోటా మరో ఓవర్‌ ఉన్నా.. అది లభించకపోవడం బాధగా ఉందా? అని ప్రశ్నించగా.. అదేమీ లేదని, ఫాస్ట్ బౌలర్లకు అధిక ఓవర్లు ఇవ్వాల్సిన అవసరం ఉండటంతో తనకు మరో ఓవర్‌ వేసే అవకాశం రాలేదని సర్దిచెప్పాడు అమిత్‌.
 

మరిన్ని వార్తలు