పాక్‌ క్రికెటర్లతో కోచ్‌కు తిప్పలు

15 Oct, 2019 15:32 IST|Sakshi

కరాచీ: ఇటీవల శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మూడు టీ2ల సిరీస్‌లో పాకిస్తాన్‌ వైట్‌వాష్‌ కావడంతో ఆ జట్టు ప్రధాన కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌ మిస్బావుల్‌ హక్‌ విమర్శల పాలవుతున్నాడు. టీ20 ఫార్మాట్‌లో నంబర్‌ వన్‌గా ఉన్న పాకిస్తాన్‌.. శ్రీలంక ‘జూనియర్‌’ జట్టు చేతిలో ఘోర పరాభవాన్ని మూట గట్టుకోవడంతో మిస్బావుల్‌పై అభిమానులు అప్పుడే సోషల్‌ మీడియాలో సెటైర్లు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంచితే, పాకిస్తాన్‌ క్రికెటర్లు క్రమశిక్షణ విషయంలో కూడా సరైన వైఖరిని ప్రదర్శించడం కూడా మిస్బావుల్‌కు తలపోటుగా మారింది. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులోని పలువురు క్రికెటర్లు ప్రాక్టీస్‌ చేయడంలో కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమే మిస్బావుల్‌ కొత్త తలపోటుకు కారణమైంది.

‘కొంతమంది పాక్‌ ఆటగాళ్లు ట్రైనింగ్‌ను తేలిగ్గా తీసుకోవడమే కాకుండా రిలాక్స్‌డ్‌గా గడపడం మిస్బావుల్‌కు మింగుడు పడటం లేదు. ఒకవైపు తమ క్రికెట్‌ క్రమశిక్షణా ప్రమాణాలను పెంచాలని మిస్బా చూస్తున్నా అందుకు ఆటగాళ్ల నుంచి సహకారం లభించడం లేదు. ఈ విషయంలో కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎవరైతే క్రమ శిక్షణలో భాగమైన ప్రాక్టీస్‌ను ఎగ్గొడుతున్నారో వారిని మందలించే యత్నం కూడా చేయడం లేదు. వారంటే సర్ఫరాజ్‌ భయపడుతున్నట్లు ఉన్నాడు. ప్రధానంగా వహాబ్‌ రియాజ్‌, ఇమాద్‌ వసీం, హరీస్‌ సొహైల్‌ల వ్యవహారం మిస్బాను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదో వంకతో ప్రాక్టీస్‌ను తప్పించుకోవడానికే వారు చూస్తున్నారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో మ్యాచ్‌కు సంబంధించి ప్రణాళికల్లో భాగం కావడానికి కూడా వారు రావడం లేదు’ అని పీసీబీలోని ఉన్నతస్థాయి అధికారి ఒకరు పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు