వోల్వ్స్‌కు ఊరట

21 Sep, 2013 00:47 IST|Sakshi
వోల్వ్స్‌కు ఊరట

మొహాలీ: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టుకు ఊరటనిచ్చే విజయం దక్కింది. కందురతా మారూన్స్‌తో శుక్రవారం జరిగిన చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో వోల్వ్స్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ (60 బంతుల్లో 93 నాటౌట్; 6 ఫోర్లు; 5 సిక్స్‌లు) మరోసారి తన సూపర్ ఫామ్ చాటుకున్నాడు. కందురతాపై 10 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని అందించాడు.
 
  ముందుగా మిస్బా సేన 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సల్మాన్ (21 బంతుల్లో 21; 1 ఫోర్) మినహా ఎవరూ పది పరుగులు దాటలేదు. దిల్హారాకు మూడు, కులశేఖరకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కందురతా 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 136 పరుగులు చేసింది. సంగక్కర (36 బంతుల్లో 44; 4 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తరంగ (27 బంతుల్లో 25; 4 ఫోర్లు), సిల్వ (24 బంతుల్లో 25; 1 ఫోర్; 1 సిక్స్) రాణించారు. ఆదిల్‌కు మూడు, ఇమ్రాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
 
 ఆదిలో తడబడినా..
 ప్రారంభంలో కందురతా బౌలర్లు వోల్వ్స్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. దీంతో తొలి ఐదు ఓవర్లలో 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే మిస్బా జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఐదో వికెట్‌కు సల్మాన్‌తో కలిసి 74 పరుగులు జత చేశాడు. 16వ ఓవర్‌లో వరుసగా ఓ సిక్స్, రెండు బౌండరీలు బాది స్కోరును పరిగెత్తించాడు.
 
 ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి ఒంటి చేత్తో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కందురతా జట్టు ఆటగాళ్లను వోల్వ్స్ బౌలర్లు ఆటాడుకున్నారు. రెండో ఓవర్‌లో తరంగ వరుసగా మూడు ఫోర్లతో రెచ్చిపోయినా త్వరగానే అవుటయ్యాడు. ఉన్నంతలో సంగక్కర సమర్థవంతంగానే ఆడినా అటు వైపు నుంచి సహకారం కరువైంది. దీంతోపాటు వరుస విరామాల్లో వికెట్లు నేలకూలడంతో పరాజయం ఖాయమైంది.
 

మరిన్ని వార్తలు