హెడ్‌ కోచ్‌గా, చీఫ్‌ సెలక్టర్‌గా..

4 Sep, 2019 19:15 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ మిస్బావుల్‌ హక్‌ ఆ దేశ ప్రస్తుత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు పీసీబీ మిస్బావుల్‌ హక్‌ను హెడ్‌ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌ కోచ్‌ పదవి కోసం పలువురు దిగ్గజాలు పోటీ పడ్డప్పటికీ మిస్బావుల్‌కే పీసీబీ పెద్దలు పెద్ద పీట వేశారు. ప్రధానంగా విదేశీ కోచ్‌లను వద్దనుకున్న పీసీబీ.. స్వదేశీ కోచ్‌ల్లో మిస్బావులే యోగ్యుడిగా భావించి అతనికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. మూడేళ్ల పాటు మిస్బావుల్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. కాగా,  పాకిస్తాన్‌కు చెందిన ఆరు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ జట్ల కోచ్‌లకు చీఫ్‌ సెలక్టర్‌గా కూడా మిస్బావుల్‌నే ఎంపిక చేయడం విశేషం. దాంతో దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి హెడ్‌ కోచ్‌ల పని తీరును కూడా మిస్బావులే పర్యవేక్షించాల్సి ఉంటుంది.  

2017 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన మిస్బావుల్‌ తన తాజా నియామకంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తనపై ఉంచిన  అతి పెద్ద బాధ్యతగా పేర్కొన్నాడు. ఇప్పుడు తనపై చాలా అంచనాలు ఉన్నాయని, దాన్ని సాకారం చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడమే తన ముందున్న లక్ష్యమని తెలిపాడు.  ఇక బౌలింగ్‌ కోచ్‌గా పాకిస్తాన్‌ దిగ్గజ బౌలర్‌ వకార్‌ యూనిస్‌ను ఎంపిక చేశారు. గతంలో పాకిస్తాన్‌ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న వకార్‌పై మరోసారి నమ్మకం ఉంచుతూ బౌలింగ్‌ కోచింగ్‌ బాధ్యతలు అప్పగించింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు