ఉండాలా? వద్దా?

3 Mar, 2017 12:00 IST|Sakshi
ఉండాలా? వద్దా?

కరాచీ: తన కెప్టెన్సీ పదవిపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు పాకిస్తాన్ టెస్టు క్రికెట్ కెప్టెన్ మిస్బావుల్ హక్.  కొన్ని రోజుల క్రితం కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకోవాలంటూ ప్రశ్నించిన మిస్బావుల్.. అసలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తన అవసరం ఉందా? లేదా? అనే విషయాన్ని తేల్చుకునే పనిలో పడ్డాడు. దీనిలో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ను కలిసి తన కెప్టెన్సీ పదవిపై క్లారిటీ కోరనున్నాడు. ఈ మేరకు మరో రెండు రోజుల్లో షహర్యార్ ఖాన్ తో భేటీ కానున్నట్లు మిస్బా తెలిపాడు. మరికొద్ది రోజుల్లో  వెస్టిండీస్ తో సిరీస్ ఆరంభం కానున్న తరుణంలో తన కెప్టెన్సీపై తుది నిర్ణయాన్ని షహర్యార్ కే వదిలేయనున్నట్లు మిస్బా తెలిపాడు .

'వచ్చే సిరీస్ కు ఆటగాడిగా అందుబాటులో ఉంటా. అంతవరకూ ఓకే. అదే క్రమంలో కెప్టెన్ గా నేనే ఉంటానా?లేక ఎవరినైనా ఎంపిక చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఆ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ నిర్ణయిస్తారు. దాని కోసమే రెండు రోజుల్లో షహర్యార్ ను కలిసి వివరణ అడుగుతా?' అని మిస్బా  పేర్కొన్నాడు.

ఇటీవల పాకిస్తాన్ టెస్టు క్రికెట్ కెప్టెన్సీ నుంచి దిగే ప్రసక్తే లేదని మిస్బా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 'నన్ను ఎల్లగొట్టేందుకు ప్రయత్నం జరుగుతుంది. నేను ఫిట్గానే  ఉన్నసమయంలో నన్ను వీడ్కోలు చెప్పమంటున్నారు. ఇక్కడ వయసు అనేది ప్రధానం కాదు.. ఫిట్ నెస్ అనేదే ముఖ్యం. నేను చాలా ఫిట్ గా ఉన్నా. ఇప్పుడు నేనున్నపరిస్థితుల్లో వీడ్కోలు చెప్పే యోచన లేదు. త్వరలో జరగబోయే పీఎస్ఎల్లో నా ఫిట్ నెస్ను నిరూపించుకుంటా' అంటూ మిస్బా ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ పరిస్థితుల్లో షహర్యార్ తో మిస్బా భేటీ కావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఇక బోర్డుతో తాడో పేడో తేల్చుకునేందుకే మిస్బా సిద్ధమయ్యాడనే వాదని వినిపిస్తోంది. ఒకవేళ తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోమని బోర్డు ఆదేశించిన పక్షంలో ఆటగాడిగా కూడా వీడ్కోలు చెప్పాలని మిస్బా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు