కెప్టెన్సీ ఇవ్వకపోతే టోర్నీకి గుడ్ బై!

17 Dec, 2015 12:38 IST|Sakshi
కెప్టెన్సీ ఇవ్వకపోతే టోర్నీకి గుడ్ బై!

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) త్వరలో ప్రారంభించనున్న పాకిస్థాన్ టీ20 సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తమకు ప్రాధాన్యం కల్పించకపోవడంపై ఇద్దరు పాక్ సీనియర్ క్రికెటర్లు అసంతృప్తిగా ఉన్నారు. దిగ్గజ హోదా ఇవ్వకపోవడంపై యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్ వ్యతిరేఖ ధోరణిని అవలంభించేలా కనిపిస్తోంది. పాక్ జట్టుకు 2009లో జరిగిన టీ20 ప్రపంచ కప్ను అందించిన తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై యూనిస్ నిరాశ చెందినట్లు కనిపిస్తోంది. విదేశీ ఆటగాళ్లకు ఇచ్చే ప్రాధాన్యం వారికి ఇవ్వకపోవడంతో టోర్నీకి గుడ్ బై చెప్పాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ బోర్డు టీ20 లీగ్ ఫ్రాంచైజీ జట్లలో ఏదైనా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించకపోతే వారు టోర్నీ నుంచి వైదొలుగుతారని వారి సన్నిహితులు తెలిపారు.

కెప్టెన్సీ, జట్టు మెంటర్ లాంటి ప్రధాన బాధ్యతలు ఇవ్వకపోతే టీ20 టోర్నీ ఆడే ప్రసక్తేలేదని యూనిస్ ఇటీవలే స్పష్టం చేసిన విషయం అందరికీ విదితమే. పాక్ టెస్ట్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్, మహ్మద్ హఫీజ్ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. కెవిన్ పీటర్సన్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ లాంటి విదేశీ క్రికెటర్లకు ఐకాస్ స్టేటస్ ఇచ్చి తనను పక్కనపెట్టడంపై మిస్బా నిరాశ చెందినట్లు చెప్పాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టులోనే చోటు దక్కించుకోలేని పీటర్సన్కు పాక్ చేపట్టనున్న పీఎస్ఎల్లో జట్టు బాధ్యతలు అప్పగించడంపై యూనిస్, మిస్బా కాస్త సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ నుంచి కేవలం షాహిద్ ఆఫ్రిది, షోయబ్ మాలిక్ ఐకాన్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న దోహా (ఖతార్) వేదికగా పీఎస్ఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. 20 రోజులపాటు అంటే.. 24వ తేదీ వరకు జరిగే మొదటి సీజన్ లో మొత్తం ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి.

>
మరిన్ని వార్తలు