పాక్‌ కోచ్‌గా అతని ఎంపిక లాంఛనమే!

30 Aug, 2019 15:37 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా మిస్బావుల్‌ హక్‌ను నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే మిస్బావుల్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించడానికి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌ పాక్‌ క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, స్వదేశీ క్రికెటర్‌ కావడంతో మిస్బావుల్‌ హక్‌కే మొగ్గుచూపినట్లు సమాచారం.  విదేశీ కోచ్‌ల ప్రయోగం పాకిస్తాన్‌కు పెద్దగా లాభించకపోవడంతో డీన్‌ జోన్స్‌ను ఫైనల్‌ జాబితా వరకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది.

పీసీబీ కుదించిన జాబితాలో మిస్బావుల్‌ హక్‌తో పాటు ఆ దేశానికి చెందిన మొహిసిన్‌ హసన్‌ కూడా పోటీ పడ్డారు. అయితే 65 ఏళ్ల మొహిసిన్‌ ఖాన్‌పై పీసీబీ పెద్దగా ఆసక్తికనబరచలేదు. ఆయనకి వయసే ప్రధాన అడ్డంకిగా నిలవడంతో మిస్బావుల్‌కే ఫైనల్‌ ఓటేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక బౌలింగ్‌ కోచ్‌గా వకార్‌ యూనస్‌ను ఎంపిక చేయడానికి మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. అంతకుముందు పాకిస్తాన్‌ ప్రధాన కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న వకార్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమించాలని యోచిస్తున్నారు. ఈ రేసులో వెస్టిండీస్‌ దిగ్గజ బౌలర్‌ కర్ట్నీ వాల్ష్‌ ఉన్నప్పటికీ వకార్‌కే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు చూస్తున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు