ఈసారి అలా జరగదు..!

23 Jun, 2018 00:44 IST|Sakshi

‘విదేశీ టెస్టులు’గా అనిపించడం లేదు!

ఇంగ్లండ్‌తో సిరీస్‌పై కోహ్లి వ్యాఖ్య 

సన్నాహాలకు సమయం  లభిస్తోందన్న కెప్టెన్‌ 

81 రోజుల పర్యటనకు బయల్దేరిన భారత్‌  

న్యూఢిల్లీ: కొన్నాళ్ల క్రితం ఎలాంటి సన్నాహాలు లేకుండా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్‌ జట్టు తొలి రెండు టెస్టులు ఓడి సిరీస్‌ కోల్పోయింది. ఆ తర్వాత మూడో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ పర్యటన షెడ్యూల్‌ను తమకు అనుకూలమైన రీతిలో మార్చుకుంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగా టి20లు, వన్డేలు ఆడనున్న భారత్, ఆ తర్వాత టెస్టు సిరీస్‌ కోసం బరిలోకి దిగుతుంది. అందుకే ఈ సిరీస్‌ను విదేశీ గడ్డపై ఆడుతున్నామనే భావన తమకు కలగడం లేదని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. 81 రోజుల సుదీర్ఘ పర్యటనకు టీమిండియా బయల్దేరడానికి ముందు కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘నాలుగేళ్ల క్రితం మా జట్టులో అందరం సమష్టిగా విఫలమయ్యాం. అయితే ఈసారి అలా జరగదు. ఒక్కసారి లయ అందిపుచ్చుకుంటే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సమస్య రాదు. అయితే దక్షిణాఫ్రికా సిరీస్‌తో పోలిస్తే మరింత కఠినమైన క్రికెట్‌ ఆడేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం.  అక్కడి వాతావరణంలో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత మంచిది. టెస్టులు మొదలయ్యే సమయానికి మేం బాగా అలవాటు పడిపోతాం కాబట్టి మాకు అంతా సౌకర్యంగా మారిపోతుంది. అసలు విదేశంలో టెస్టులు ఆడుతున్నట్లే అనిపించకపోవచ్చు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు.  

ఈ పర్యటనలో ఐర్లాండ్‌తో భారత్‌ రెండు టి20లు... ఇంగ్లండ్‌తో మూడు టి20లు, మూడు వన్డేలు, 5 టెస్టులు ఆడనుంది. జూన్‌ 27న ఐర్లాండ్‌తో భారత్‌ తొలి టి20 ఆడనుండగా... ఆగస్టు 1 నుంచి ఇంగ్లండ్‌తో తొలి టెస్టు జరుగుతుంది. 2014లో జరిగిన సిరీస్‌లో కోహ్లి 10 ఇన్నింగ్స్‌లలో 13.40 సగటుతో 134 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. ఈసారి మెరుగైన సన్నాహాల కోసం సర్రే జట్టు తరఫున అతను కౌంటీ ఆడేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే గాయంతో అది సాధ్యపడలేదు. కానీ తాను దాని గురించి బాధ పడటం లేదని కోహ్లి అన్నాడు. ‘ఏది జరిగినా అంతా మన మంచికే అని నేను భావిస్తా. నాలుగేళ్లలో పరిస్థితులు చాలా మారి ఉంటాయి కాబట్టి కౌంటీల్లో ఆడితే బాగుంటుందని అనుకున్నా. అయితే ఒక రకంగా ఆడకపోవడం మేలే చేసింది. అక్కడ బరిలోకి దిగితే మన సిరీస్‌ ప్రారంభమయ్యే సమయానికి అలసిపోయి ఇప్పుడు ఉన్నంత తాజాగా ఉండకపోయేవాడినేమో. ప్రస్తుతం నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామా అనిపిస్తోంది’ అని కోహ్లి అన్నాడు. తమ దృష్టిలో విదేశీ మైదానం ఉంటూ ఏమీ లేదని, ప్రపంచంలో ఎక్కడ ఆడినా పరిస్థితులను ఆకళింపు చేసుకొని 22 గజాల పిచ్‌ను గెలవగలమనే నమ్మకంతోనే బరిలోకి దిగుతామని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.   

చాలా మంది ఇంకా 2014 పర్యటన వద్దే ఆగిపోయినట్లున్నారు. ఆ తర్వాత మేం చాంపియన్స్‌ ట్రోఫీ కూడా ఆడాం. అదేమీ బంగ్లాదేశ్‌లో జరగలేదుగా? గత సిరీస్‌ సమయంలో కూడా నా లక్ష్యాల గురించి అడిగారు. నేను రోడ్లపై తిరుగుతూ కాఫీ తాగడం అని చెప్పాను. ఏదైనా విదేశీ పర్యటనలో నా ఆలోచనా తీరు భిన్నంగానే ఉంటుంది. నేను ఎంత బాగా ఆడగలనో నాకు బాగా తెలుసు. ఎవరో చెప్పనవసరం లేదు. క్రీజ్‌లోకి వెళ్లాక నేనేం చేయాలో తెలుసు.
–2014 సిరీస్‌ వైఫల్యంపై అసహనంతో కోహ్లి సమాధానం 

యో యో టెస్టు ఏదో ఒకసారి జరుగుతుందని భావించడం పొరపాటు. అది ఇక ముందూ కొనసాగుతుంది. మీరు పాస్‌ అయితే సంతోషం. మీ వల్ల కాదంటే వెళ్లిపోవడం ఉత్తమం. ఆటలో ఎంత సత్తా ఉన్నా ఫిట్‌గా ఉండటం కూడా ముఖ్యమనే ఉద్దేశంతోనే యో–యో టెస్టుపై ప్రత్యేక దృష్టి  పెట్టాం.
– రవిశాస్త్రి, కోచ్‌  

మరిన్ని వార్తలు