ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ

8 Mar, 2017 15:49 IST|Sakshi
ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ

బెంగళూరు: రెండో టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా తర్వాతి రెండు మ్యాచ్ ల్లో అతడు బరిలోకి దిగడం లేదు. స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు.

'కొంతకాలంగా మిచెల్ మార్ష్ భుజం గాయంతో బాధ పడుతున్నాడు. సమ్మర్ సీజన్ లో చాలా వరకు ఇలానే ఆడాడు. ఇప్పటివరకు ఇలాగే మేనేజ్ చేశాం. గాయం ఎక్కువకావడంతో అతడు ఆడలేకపోతున్నాడ'ని ఆస్ట్రేలియా జట్లు ఫిజియో డేవిడ్ బీక్లే తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునేందుకు మార్ష్‌ స్వదేశానికి తిరిగిరానున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది.

టీమిండియాతో జరిగిన రెండు టెస్టుల్లో మిచెల్ మార్ష్ పెద్దగా రాణించలేదు. నాలుగు ఇన్నింగ్స్ లో కలిపి 48 పరుగులు మాత్రమే సాధించాడు. ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతడి స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. మార్ష్‌ స్థానంలో ఉస్మాన్ ఖ్వాజా, గ్లెన్ మ్యాక్స్ వెల్ ను ఆడించే అవకాశాలున్నామని కోచ్ డారెన్ లెహమాన్ తెలిపాడు. వీరిద్దరూ జట్టులో ఉన్నప్పటికీ ఆడే అవకాశం రాలేదు. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్-ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. మూడో టెస్టు రాంచీలో మార్చి 16 నుంచి ప్రారంభమవుతుంది.

మరిన్ని వార్తలు