చెలరేగిన మార్ష్, వైట్‌మన్

9 Jul, 2014 01:30 IST|Sakshi

ఆస్ట్రేలియా ‘ఎ’కు ఆధిక్యం   
 భారత్ ‘ఎ’తో మ్యాచ్
 
 బ్రిస్బేన్: భారత్ ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఆస్ట్రేలియా ‘ఎ’ ఎదురుదాడికి దిగింది. మిచెల్ మార్ష్ (294 బంతుల్లో 211; 21 ఫోర్లు, 10 సిక్సర్లు), స్యామ్ వైట్‌మన్ (278 బంతుల్లో 174; 26 ఫోర్లు, 1 సిక్స్) రికార్డు భాగస్వామ్యంతో ఆ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. మ్యాచ్ మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 522 పరుగులు చేసింది.
 
 126/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ జట్టు... మార్ష్, వైట్‌మన్ ఏడో వికెట్‌కు 371 పరుగులు జోడించడంతో భారీ స్కోరు సాధించింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఈ వికెట్‌కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కాగా... ఆసీస్ గడ్డపై ఇదే అత్యుత్తమం. భారత బౌలర్లలో బుమ్రాకు 4 వికెట్లు దక్కాయి.
 

మరిన్ని వార్తలు