క్రికెటర్ సొంతంగా ఏప్రిల్ ఫూల్ అయ్యాడు..!

1 Apr, 2017 19:57 IST|Sakshi
క్రికెటర్ సొంతంగా ఏప్రిల్ ఫూల్ అయ్యాడు..!

ముంబై: ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ ఓ విషయంలో చేసిన పొరపాటుతో ఏప్రిల్ కు ఒక్కరోజు ముందే ఏప్రిల్ ఫుల్ అయ్యాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ అధికారిక అకౌంట్ అని భావించి విరాట్ కోహ్లీ పేరుతో ఉన్న మరో ట్విట్టర్ ఖాతాకు ఓ సందేశం పంపాడు స్టార్క్. కోహ్లీలాగే స్పందించిన ఆ ట్విట్టర్ యూజర్ స్టార్క్‌ సందేశానికి రిప్లైలు ఇచ్చాడు. చివరగా తాను కోహ్లీని కాదని బయటపెట్టాడు. స్టార్క్ పొరపాటుగ తనకు ఐపీఎల్ కు సంబంధించి, తన ఆట గురించి ట్వీట్లు చేశాడని కోహ్లీ పేరుతో చాట్ చేసిన వ్యక్తి వెల్లడించాడు.

విరాట్ కోహ్లీ, ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌లు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కోహ్లీ కెప్టెన్సీలోనే తనకు ఆడాలని ఉందని, వేరే జట్టును చూసుకునే పని పెట్టవద్దని స్టార్క్ తన చాట్‌లో రాసుకొచ్చాడు. 'సిరీస్ నెగ్గినందుకు అభినందనలు. భుజం గాయం నుంచి నువ్వు కోలుకోవాలి. ఈ సమ్మర్ వ్యక్తిగతంగానూ నీకు కలిసిరావాలి. బెంగళూరు జట్టు టైటిల్ నెగ్గాలి' అని కోహ్లీ పేరుతో ఉన్న వేరే ట్విట్టర్ ఖాతాకు మిచెల్ స్టార్క్ ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు.

కోహ్లీ కాదని యూజర్ చేసిన ట్వీట్‌కు మంచి స్పందన వచ్చింది. ఎట్టకేలకు కోహ్లీకి మంచి జరగాలని ఓ ఆసీస్ ప్లేయర్ కోరాడని కొందరు... ఇదే నిజమైతే ఆస్ట్రేలియా, భారత క్రికెటర్లు ఎప్పటికీ స్నేహితులేనని మరికొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. బెంగళూరు జట్టులో కెప్టెన్ కోహ్లీతో తనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని స్టార్క్ ఇలా చేశాడని కామెంట్లు వస్తున్నాయి.


మరిన్ని వార్తలు