సీఈఓను కలిసిన మిథాలీ, హర్మన్‌

27 Nov, 2018 01:14 IST|Sakshi

తుది జట్టు వివాదంపై వివరణ

న్యూఢిల్లీ: టి20 ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ నుంచి సీనియర్‌ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌ను తప్పించిన వివాదం బీసీసీఐకి వివరణ ఇచ్చే వరకు చేరింది. దీనికి సంబంధించి సోమవారం బోర్డు సీఈఓ రాహుల్‌ జోహ్రిని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, మిథాలీ రాజ్‌ కలిశారు. వేర్వేరుగా సమావేశమైన వీరిద్దరు మ్యాచ్‌ రోజు పరిణామాలు, తుది జట్టు ఎంపిక అంశంపై తమ వైపు నుంచి వివరణ ఇచ్చారు. సీఈఓతో పాటు జనరల్‌ మేనేజర్‌ (ఆపరేషన్స్‌) సబా కరీం కూడా ఇందులో పాల్గొన్నారు. భారత జట్టు మేనేజర్‌ తృప్తి భట్టాచార్య కూడా ఇదే సమయంలో తన నివేదికను అందించారు. ‘నేను, కరీం కలిసి మిథాలీ, హర్మన్, తృప్తిలతో వేర్వేరుగా సమావేశం అయ్యాం. వారి వైపు నుంచి ఏం చెప్పాలో అది చెప్పారు. మేం ప్రతీ అంశాన్ని రాసుకున్నాం.   అయితే మేము ఏం చర్చించామని మాత్రం నన్నడగవద్దు’ అని జోహ్రి వెల్లడించారు. కోచ్‌ రమేశ్‌ పొవార్‌ కూడా జోహ్రి, కరీంలను బుధవారం కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత అన్ని అంశాలతో కలిపి సీఓఏకు జోహ్రి సమగ్ర నివేదిక అందజేస్తారు. మరోవైపు ఈ నెల 30తో రమేశ్‌ పొవార్‌ తాత్కాలిక పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కోచ్‌   పదవి కోసం కొత్తగా బీసీసీఐ దరఖాస్తులు కోరే     అవకాశం ఉంది.  

ప్రశ్నించడం అనవసరం: ఎడుల్జీ  
తుది జట్టు ఎంపికను బయటి వ్యక్తులు ఎవరూ ప్రశ్నించరాదని సీఓఏ సభ్యురాలు, భారత మాజీ కెప్టెన్‌ డయానా ఎడుల్జీ అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తూ భారత్‌ ఓడిపోవడంతోనే వివాదం ముదిరిందని ఆమె అన్నారు. ‘తుది జట్టు ఎంపిక అంశాన్ని అవసరానికి మించి పెద్దదిగా చేసి చూపించారు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ జట్టును మార్చకూడదని భావించింది. అయితే ఆ వ్యూహం ఫలించలేదు. ఒకవేళ భారత్‌ గెలిచి ఉంటే ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించకపోయేవారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ రోజున భారత్‌కు ఏదీ కలిసి రాలేదంతే’ అని ఎడుల్జీ అభిప్రాయపడింది.   

2022 కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌!
దుబాయ్‌: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగనున్న 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌ను చేర్చాలని కోరుతూ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బిడ్‌ దాఖలు చేసింది. ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) భాగస్వామ్యంతో ఐసీసీ ఈ బిడ్‌ వేసింది. మహిళల క్రికెట్‌ను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు, సాధికారత దిశగా వారిని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో తామీ చొరవ తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. ఇందుకు సభ్య దేశాలతో పాటు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు పూర్తి మద్దతుగా నిలిచారని... వచ్చే నెలలో ఈసీబీ ప్రతినిధులతో కలిసి కామన్వెల్త్‌ క్రీడా కమిటీకి బిడ్‌ను అందజేయనున్నట్లు ప్రకటించింది. దీనిప్రకారం... టి20 ఫార్మాట్‌లో జరిగే టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా పాల్గొంటాయి. మరోవైపు మహిళా క్రికెట్‌ను కామన్వెల్త్‌ క్రీడల్లో చేర్చేందుకు బర్మింగ్‌హామ్‌ సరైన ప్రదేశంగా ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవ్‌ రిచర్డ్‌సన్‌ పేర్కొన్నారు. ఈ చర్య మహిళా క్రికెట్‌కు ముందడుగుగా ఈసీబీ చైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ వెల్లడించారు. ఇది గొప్ప ఆలోచనని, అభిమానుల ఆదరణ పొందేందుకు, ఎక్కువ మ్యాచ్‌లు ఆడేందుకు దోహదపడుతుందని భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు