మిథాలీని ఆదర్శంగా తీసుకోవాలి

7 Aug, 2017 10:48 IST|Sakshi
మిథాలీని ఆదర్శంగా తీసుకోవాలి

హైదరాబాద్: భారత మహిళల క్రికెట్‌ జట్టులో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి ఉండటమే కాకుండా జట్టుకు నాయకత్వం వహిస్తున్న మిథాలీరాజ్‌ను సన్మానించుకోవడం మన కర్తవ్యంగా భావిస్తున్నామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షులు డా.జి.వివేక్‌ అన్నారు. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఆదివారం ఉప్పల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం మీటింగ్‌ హాలులో ఆమెను ఘనంగా సత్కరించి రూ. 5 లక్షల నగదు పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళల వరల్డ్‌ కప్‌లో మిథాలీరాజ్‌ గొప్పగా రాణిం చిందన్నారు.

 

భావి మహిళా క్రికెటర్లకు మిథాలీరాజ్‌ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మహిళా క్రికెటర్లకు చేయూతనిచ్చేందుకు హెచ్‌సీఏ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అనంతరం భారత మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ మాట్లాడుతూ... హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఇంత గొప్పగా సన్మానిస్తున్నందుకు హెచ్‌సీఏ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ ఆటగాళ్లంతా రావడం ఆనందంగా ఉందన్నారు. హెచ్‌సీఏ సహకారంతో రానున్న రోజుల్లో మరింతగా రాణిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ జస్టిస్‌ సీతాపతి, మాజీ మంత్రి వినోద్, మిథాలీరాజ్‌ కోచ్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు