ఈ స్పందన... ఆ బాధను దూరం చేసింది!

30 Jul, 2017 00:40 IST|Sakshi
ఈ స్పందన... ఆ బాధను దూరం చేసింది!

ఇంతటి అభిమానాన్ని ఎప్పుడూ చూడలేదు  
‘సాక్షి’తో భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌   


మిథాలీ రాజ్‌ క్రికెట్‌కు కొత్త కాదు... ఆమె అంతర్జాతీయ కెరీర్‌కే ఇప్పుడు ఓటు హక్కుకున్నంత వయస్సుంది. రికార్డులు, ఘనతలు కూడా ఆమెకు కొత్త కాదు... కానీ ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది అంతా కొత్తగా మారిపోయింది. ఆత్మీయ పలకరింపులు, స్వాగతాలు, అభినందనలు... ఇలా గతంలో ఎన్నడూ మిథాలీకి పెద్దగా పరిచయం లేనివి అన్నీ ఇప్పుడు ఒకేసారి కనిపిస్తున్నాయి. ఇదంతా వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ప్రదర్శన వల్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లండన్‌ నుంచి మొదలు పెట్టి వయా ముంబై, ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌ చేరిన భారత కెప్టెన్‌కు అన్ని చోట్లా అపూర్వ సత్కారం దక్కింది. నాయకురాలిగా ముందుండి జట్టును ఫైనల్‌ వరకు నడిపించిన ఈ హైదరాబాదీ, గత వారం రోజులుగా సాగుతున్న సంబరాలను సంతోషంగా ఆస్వాదిస్తోంది. ఒక్క టోర్నీకే కాకుండా ఈ ఆదరణను మున్ముందూ కొనసాగించాలని, మహిళా క్రికెట్‌కు పట్టం కట్టాలని కోరుకుంటోంది.  

సాక్షి, హైదరాబాద్‌
ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత తమ జట్టుకు లభిస్తోన్న ప్రోత్సాహం, ఆదరణను అసలు ఏమాత్రం ఊహించలేదని భారత మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. తమ జట్టు టైటిల్‌ నెగ్గకపోయినా దేశమంతటా అభిమానులు మద్దతు పలకడం నిజంగా విశేషమని ఆమె అభిప్రాయపడింది. స్వస్థలం చేరుకున్న అనంతరం మిథాలీ శనివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. వరల్డ్‌ కప్‌లోని కొన్ని ప్రత్యేక క్షణాలు, అనంతర పరిణామాలపై తన మనోభావాలు పంచుకుంది. విశేషాలు ఆమె మాటల్లోనే...

ఫైనల్‌ అనంతరం దక్కుతున్న అభినందనలపై...
చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. దీనిని అసలు ఏమాత్రం ఊహించలేదు. నిజానికి ఫైనల్లో అంత దగ్గరగా వచ్చి ఓడిపోవడంతో నేను ఎంతగానో బాధ పడ్డాను. గుండె పగిలినట్లు అనిపించింది. అంతా కోల్పోయినట్లు పరధ్యానంలో ఉండిపోయాను. కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. అయితే ముంబైలో దిగే సమయంలో విమానాశ్రయంలో మాకు దక్కిన స్వాగతం, పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను దాటుతూ 3 నిమిషాల ప్రయాణానికి కూడా గంట పట్టడం మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇలాంటి స్పందన మా బాధను దూరం చేసింది. ఫలితంతో సంబంధం లేకుండా దేశమంతా మా వైపు నిలబడటం నా జీవితంలో ఇదే మొదటిసారి. ఓడినా దేశం గర్వపడేలా ప్రదర్శన ఇచ్చామని అంతా చెప్పారు. మా అమ్మాయిలు అందరూ ఆ సమయంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. 2005లో కూడా మేం ఇలాగే ఫైనల్‌ చేరాం. కానీ అప్పుడు ఎలా తిరిగొచ్చామో, అసలు మమ్మల్ని ఎవరు పలకరించారో కూడా గుర్తు లేదు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించడంపై...
హైదరాబాద్‌లో కూడా నాకు మొదటిసారి ఈ తరహాలో స్వాగతం దక్కింది. ప్రభుత్వ అధికారులే నేరుగా విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు తీసుకువెళ్లారు. ఆయన చాలా ఆత్మీయంగా పలకరించి నువ్వు హైదరాబాద్‌ బిడ్డవు అనడం చాలా గర్వంగా అనిపించింది. ఇక నగదు ప్రోత్సాహకం, ఇంటి స్థలం నేను ఊహించలేదు. నిజానికి నాకు గతంలో హామీ ఇచ్చిన ఇంటి స్థలం గురించి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ సమయంలోనే ప్రయత్నాలు చేసీ చేసీ ఇక నా వల్ల కాదని వదిలేశాను. మా అమ్మను కూడా అడగడం మానేయమని చెప్పేశా. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మూడేళ్లలో దాని గురించి మళ్లీ నా అంతట నేను ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు సీఎం దానిని ప్రకటించడం ఆనందకరం.

ఫైనల్లో పరాజయంపై...
పూనమ్, వేద ఆడుతున్నప్పుడు ఇక గెలుపు మాదే అనిపించింది. నిజానికి వేద సహజశైలిలో షాట్లు ఆడుతుంటే కాస్త జాగ్రత్తగా ఆడమని సూచనలు ఇవ్వాలని అనుకున్నా. అయితే ఆ సమయంలో బయటి నుంచి చెప్పడం సులభం. కానీ వరల్డ్‌ కప్‌ ఫైనల్లో దానిని అమలు చేయడం కష్టం కాబట్టి అది ఆమెకే వదిలేశా. ఆ ఒత్తిడిలో ఆడటం అంత సులువు కాదు. దురదృష్టవశాత్తూ ఆమె ఈ సవాల్‌ను అధిగమించలేకపోయింది. మున్ముందు అనుభవంతో నేర్చుకుంటుంది.

వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డుపై...
నేను క్రికెట్‌ మొదలు పెట్టినప్పుడు ఇంత ముందుకు వెళతానని ఏనాడూ ఊహించలేదు. 18 ఏళ్ల కెరీర్‌ను చూస్తే చాలా గర్వంగా అనిపిస్తోంది. అత్యధిక పరుగుల రికార్డు, 6 వేల పరుగులు దాటిన తొలి క్రీడాకారిణి కావడం, వరుసగా 7 అర్ధ సెంచరీలు చాలా సంతోషాన్ని కలిగించాయి.

మరో వరల్డ్‌ కప్‌ ఆడటంపై...
ఇంత మంచి ప్రదర్శన తర్వాత ప్రపంచకప్‌ గెలిచి ఉంటే బాగుండేది. ఈ టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి ఇదే నా చివరి ప్రపంచ కప్‌ అని పదే పదే చెబుతూ వచ్చాను. కానీ ఇప్పుడు మళ్లీ ఆలోచించాను. ఈ విషయంలో నేనే తొందరపడి వ్యాఖ్యానించానేమో అనిపిస్తోంది. ఫామ్, ఫిట్‌నెస్‌ చూస్తే నేను కనీసం 2–3 ఏళ్లు సునాయాసంగా ఆడగలను. ఇప్పుడే వచ్చే ప్రపంచ కప్‌పై చెప్పలేను గానీ నన్ను నేను ఆశ్చర్యపరిచే నిర్ణయం కూడా తీసుకోవచ్చు!

మహిళలకు ఐపీఎల్‌ నిర్వహించడంపై...
నా ఉద్దేశం ఇప్పటికిప్పుడు ఐపీఎల్‌ పెట్టమని కాదు. ఇప్పుడు మహిళల క్రికెట్‌పై కూడా అందరి దృష్టి నిలిచింది. ఆటగాళ్లను అంతా పేర్లతో సహా గుర్తు పడుతున్నారు. ఇకపై జరిగే మ్యాచ్‌లు చూసేందుకు, స్కోర్లు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే దురదృష్టవశాత్తూ మహిళల క్రికెట్‌లో దేశవాళీ టోర్నీలు పెద్దగా లేవు. కాబట్టి ప్రపంచకప్‌కు కొనసాగింపుగా వెంటనే ఒక టోర్నీ ఉంటే అది మేలు చేస్తుందనేది నా సూచన. ఐపీఎల్‌లాంటి టోర్నీ ఉంటే నిజంగా బాగుంటుంది. అయితే తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐనే.

గెలిచినా, ఓడినా జట్టుగా మేమంతా ఎంతో ఉత్సాహంగా గడిపాం. హర్మన్‌ సెంచరీ చేసిన సమయంలో మైదానంలో వినిపిస్తున్న పాటకు అనుగుణంగా నేను, వేద డ్యాన్స్‌ వేయడం కూడా అలాంటిదే.

నాకు అన్ని రకాల పుస్తకాలు చదివే అలవాటు మొదటి నుంచీ ఉంది. మైదానంలో ఒత్తిడికి లోను కాకుండా, ప్రశాంతంగా స్థితప్రజ్ఞతతో ఉండేందుకు నాకు పుస్తక పఠనం తోడ్పడుతుంది. కెమెరాలు దృష్టి పెట్టడంతో నేను బౌండరీ బయట కూర్చొని చదవడం అందరికీ కనిపించింది. వాటిలో కొన్ని అంశాలు క్రికెట్‌ పరిజ్ఞానాన్ని కూడా పెంచేవే.

మరిన్ని వార్తలు