మిథాలీ ఈజ్‌ ది బెస్ట్‌

30 Jan, 2019 20:14 IST|Sakshi

హామిల్టన్‌: మహిళా క్రికెట్‌లో మిథాలీ రాజ్‌ మకుటం లేని మహారాణిగా ఎదిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహిళల క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తిరగరాసిన మిథాలీ.. తాజాగా తన ఖాతాలో మరో అరుదైన రికార్డును నమోదుచేసింది. వన్డే క్రికెట్‌లో ఛేజింగ్‌లో అత్యధిక యావరేజ్‌తో మిథాలీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఛేదనలో 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియా విజయంలో మిథాలీ కీలకపాత్ర పోషించింది. ఈ క్రమంలో మిథాలీ ఛేదనలో అత్యధిక సగటును నమోదు చేయడవ విశేషం. కాగా ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్/బ్యాట్స్‌ఉమెన్‌కు సాధ్యం కాని ఉత్తమ గణాంకాలను మిథాలీ సాధించింది. ఛేజింగ్‌లో మిథాలీ యావరేజ్ 111.29గా ఉంటే ఎంఎస్ ధోని యావరేజ్ 103.07. ఆ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి 96.23తో ఉన్నాడు. 

రికార్డుల రారాణి
ఇప్పటి వరకు 199 వన్డేలాడిన మిథాలీ మొత్తం 6,613 పరుగులుతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌వుమెన్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ఆమె ఖాతాలో ఏడు శతకాలు, 52 అర్థశతకాలు ఉన్నాయి. బ్యాటర్‌గా ఎంతో రాటుదేలిన మిథాలీ వన్డే నాయకురాలిగా గొప్ప విజయవంతమైంది. ఆమె నేతృత్వంలో టీమిండియా 122 మ్యాచ్‌లాడగా 75 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇప్పటివరకు 85 టీ20 మ్యాచ్‌లాడిన మిథాలీ 2,283 పరుగులు సాధించింది. టీ20ల్లోనూ అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌ మిథాలీనే కావడం విశేషం. మరోవైపు పురుషుల క్రికెట్‌లోనూ టీ20ల్లో ఈమెను అధిగమించిన బ్యాట్స్‌మెన్‌ లేకపోవడం విశేషం. ఆడిన 10 టెస్టుల్లో 663 పరుగులు చేసింది. 

మరిన్ని వార్తలు