మిథాలీ ‘డబుల్‌ సెంచరీ’

1 Feb, 2019 20:14 IST|Sakshi

200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు

హామిల్టన్‌: ప్రపంచ మహిళా క్రికెట్‌లో మిథాలీ రాజ్‌ మకుటం లేని మహారాణిగా ఎదిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహిళల క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తిరగరాసిన మిథాలీ.. తాజాగా తన ఖాతాలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో  200 వన్డేలు ఆడిన తొలి క్రికెటర్‌గా మిథాలీ  రాజ్‌ ప్రపంచ రికార్డును సృషించారు. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో బరిలోకి దిగడంతో  ఈ మైలురాయిని అందుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన మిథాలీ  1999లో ఐర్లాండ్‌తో తొలి వన్డే ద్వారా తన క్రికెట్‌ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 19  ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మిథాలీ  తన 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు.. ఇప్పటి వరకు 200 వన్డేలు ఆడిన ఆమె 51.66 సగటుతో 6,622 పరుగులు చేసి మహిళల క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ అనంతరం తన మిథాలీ మాట్లాడుతూ.. భారత్‌ తరఫున 200 వన్డేలు ఆడడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తన 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో మార్పులను చూశానని తన అనుభవాన్ని పంచుకున్నారు. కాగా ఇప్పటి వరకు భారత్‌ 263 వన్డే మ్యాచ్‌లు ఆడగా దానిలో 200 మ్యాచ్‌ల్లో  మిథాలీ  ప్రాతినిథ్యం ఉండటం విశేషం. ఈ సందర్భంగా  బీసీసీఐ, పలువురు క్రికెటర్లును ఆమెను అభినందించారు. 


 

మరిన్ని వార్తలు