మిథాలీపై బయోపిక్‌

27 Sep, 2017 03:21 IST|Sakshi

ముంబై: ప్రముఖ క్రీడాకారుల జీవిత చరిత్రలను సినిమాగా రూపొందించడం బాలీవుడ్‌లో ఇప్పుడు నయా ట్రెండ్‌. ఇప్పటికే అథ్లెట్‌ మిల్కాసింగ్, బాక్సర్‌ మేరీకామ్, క్రికెటర్లు ధోని, అజహరుద్దీన్, సచిన్‌ టెండూల్కర్‌లపై చిత్రాలు రాగా... బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సింధు, సైనా నెహ్వాల్, మహిళా క్రికెటర్‌ జులన్‌ గోస్వామిలపై చిత్రాలు కూడా వరుసలో ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ చేరింది. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ మిథాలీపై బయోపిక్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సంస్థ నుంచి ఇప్పటికే భాగ్‌ మిల్కా భాగ్‌ (మిల్కాసింగ్‌పై), మేరీకామ్‌ సినిమాలు వచ్చాయి.

‘నా జీవితంపై ఓ సినిమా రానుండటం చాలా సంతోషాన్నిస్తోంది. బాలికలు క్రికెట్‌ను కెరీర్‌గా మలుచుకునేందుకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాను’ అని హైదరాబాద్‌కు చెందిన మిథాలీ పేర్కొంది. మహిళల వన్డే క్రికెట్‌లో మిథాలీ ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కొనసాగుతోంది. వన్డేల్లో 6 వేల పరుగులతో పాటు వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గానూ ఖ్యాతికెక్కింది. అలాగే 2005, 2017 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టును ఫైనల్స్‌కు చేర్చిన కెప్టెన్‌గా నిలిచింది

మరిన్ని వార్తలు