మో ఫరా.. డబుల్ డబుల్

21 Aug, 2016 13:40 IST|Sakshi
మో ఫరా.. డబుల్ డబుల్

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ లో బ్రిటన్ అథ్లెట్ మో ఫరా సరికొత్త రికార్డు సృష్టించాడు. గత వారం పది మీటర్ల రేసులో స్వర్ణం పతకం సాధించిన ఫరా.. తాజాగా జరిగిన ఐదు వేల మీటర్ల రేసులో కూడా పసిడిని సొంతం చేసుకుని కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. రియోలో రెండు ఈవెంట్లలో స్వర్ణ పతకాల్ని కైవసం చేసుకోవడం ద్వారా తన గత లండన్ ఒలింపిక్స్ రికార్డును  ఫరా నిలబెట్టుకున్నాడు. దీంతో ఫిన్లాండ్కు చెందిన మాజీ అథ్లెట్ లాసె వెరెన్ సరసన ఫరా నిలిచాడు.

 

1972 మోన్రిచ్ ఒలింపిక్స్లో వెరెన్ రెండు ఈవెంట్లో బరిలోకి దిగి విజేతగా నిలిచాడు. ఆపై 1976లో మోంట్రీల్లో జరిగిన ఒలింపిక్స్లో డిఫెండింగ్ చాంపియన్గా పోరుకు సిద్ధమైన వెరెన్ దాన్ని నిలబెట్టుకున్నాడు. దాదాపు 40 సంవత్సరాల తరువాత ఆ రికార్డును సమం చేసిన ఏకైక అథ్లెట్గా ఫరా నిలిచాడు. ఈ పోరును 13:03:30 నిమిషాల్లో పూర్తి చేసిన ఫరా పసిడిని ముద్దాడాడు.దీంతో బ్రిటన్ తరపున నాలుగు వ్యక్తిగత స్వర్ణాలు అందుకున్న తొలి అథ్లెట్‌గా ఘనత సాధించాడు.

ఫరా రికార్డులు..

1999 నుంచి వివిధ అంతర్జాతీయ, యురోపియన్ యూనియన్ ఈవెంట్లలో రికార్డు టైమింగ్‌తో సత్తా చాటాడు మో ఫరా. అయితే.. బీజింగ్ ఒలింపిక్స్‌లో మాత్రం నిరాశతోనే వెనుదిరగాల్సి వచ్చింది. లండన్ ఒలింపిక్స్‌లో 10వేల మీటర్ల పరుగులో, 5వేల మీటర్ల పరుగులో బంగారు పతకాలు సాధించి బ్రిటన్ తరపున డిస్టెన్స్ రన్నింగ్‌లో తొలి స్వర్ణం అందుకున్న అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత మాస్కోలో జరిగిన ప్రపంచచాంపియన్ షిప్‌లోనూ స్వర్ణం సాధించాడు. 2015లో యూరో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో గోల్డ్‌మెడల్ ‘డబుల్’ రికార్డు సృష్టించాడు.



పడి లేచిన తరంగం..

రియో ఒలింపిక్స్ లో భాగంగా గత వారం జరిగిన పది వేల మీటర్ల పరుగులో ఫరా ట్రాక్ పై కింది పడినా, చివరకు విజేతగా నిలవడమే అతని పోరాట పటిమకు నిదర్శనం. ఆ పోరులో ఫరా పడిపోయేటప్పటికి 16 ల్యాప్ల రేసు మిగిలి ఉంది. ఆ క్షణంలో తన  పోరాటం ముగిసినట్లేనని అతను భావించాడు. కానీ కొద్ది సేపటికే తేరుకొని మొండిగా పరుగెత్తాడు. చివరకు తన స్థాయికి తగిన రీతిలో రేస్‌ను ముగించి సత్తా చాటాడు. ఈ రేసును 27 నిమిషాల 5.17 సెకన్లలో లక్ష్యం చేరి ఫరా స్వర్ణం సాధించాడు.

మరిన్ని వార్తలు