శ్రీనివాసన్ మళ్లీ ఎన్నికైతే భారత క్రికెట్ నాశనమే: మోడి

24 Sep, 2013 01:04 IST|Sakshi
శ్రీనివాసన్ మళ్లీ ఎన్నికైతే భారత క్రికెట్ నాశనమే: మోడి
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ మరోసారి ఎన్నికైతే అది భారత్ క్రికెట్‌కు వినాశకరమే అవుతుందని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడి ధ్వజమెత్తారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, వ్యాపార ప్రకటనదారులు, పరిపాలకులు శ్రీనివాసన్ తిరిగి ఎన్నికైతే తీవ్రంగా నిరాశపడతారు. అది ఓ తప్పుడు సందేశాన్ని పంపినట్టవుతుంది. ఓ రకంగా భారత క్రికెట్ మునిగినట్టే. క్రికెట్‌ను ఇక్కడ మతంగా భావిస్తారు. ఆయనకు నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. దక్షిణాది సంఘాలు ఇంకా ఆయనకే మద్దతివ్వడం శోచనీయం’ అని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మోడి అన్నారు.
 
 ‘ఏజీఎంలో పాల్గొనకుండా చూడండి’
 బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌ను బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) ఇప్పట్లో వదిలేలా లేదు. ఈనెల 29న చెన్నైలో జరిగే బోర్డు వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయన పాల్గొనకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సీఏబీ కార్యదర్శి ఆదిత్య వర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే బీసీసీఐ కమిటీల్లో కానీ, ఇతర కార్యక్రమాల్లో కానీ శ్రీనివాసన్ హాజరు కాకుండా అడ్డుకోవాలని కోరారు. 
 
>
మరిన్ని వార్తలు