విరాట్‌ కోహ్లి కాచుకో..!

29 Jun, 2019 15:58 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌లు అత్యంత కీలకం. దీనిలో భాగంగా ఆదివారం వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్‌తో ఇంగ్లండ్‌ తలపడుతోంది. ఆ జట్టు సెమీస్‌ రేసులో ఉండాలంటే భారత్‌తో మ్యాచ్‌లో విజయం చాలా అవసరం. అదే సమయంలో ఇంగ్లండ్‌పై గెలిచి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే ఇరు జట్లు వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ప్రధానంగా కోహ్లిని తొందరగా ఔట్‌ చేస్తే భారత్‌ జట్టును కట్టడి చేసినట్లేనని ఇంగ్లండ్‌ యోచిస్తోంది. కోహ్లి ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకుంటే అతన్ని ఆపడం కష్టమనే భావనలో ఇంగ్లండ్‌ ఉంది. కాగా, కోహ్లిని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్‌కు పంపుతానని ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ మొయిన్‌ అలీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కోహ్లి కాచుకో అంటూ సవాల్‌ విసురుతున్నాడు.

‘భారత్‌కు పరుగుల యంత్రంగా మారిపోయాడు కోహ్లి. అతను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో మనకు తెలుసు. అయినప్పటికీ కోహ్లిని త్వరగానే ఔట్‌ చేస్తా. కోహ్లిని ఔట్‌ చేయడం కోసమే నేను ఇక్కడ ఉన్నా’ అంటూ మొయిన్‌ అలీ పేర్కొన్నాడు.  ఇదిలా ఉంచితే అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లి ఆరుసార్లు మొయిన్‌ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.  దాంతోనే కోహ్లి వికెట్‌ను సాధిస్తానంటూ మొయిన్‌ అలీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.  మరొకవైపు ఈ మెగా టోర్నీలో కోహ్లి ఇప్పటికే నాలుగు హాఫ్‌ సెంచరీలు సాధించి జోరు మీద ఉన్నాడు.

ఇక స్వదేశంలో వరల్డ్‌కప్‌ జరుగుతున్న సందర్భంలో ఆతిథ‍్య జట్టుపై ఒత్తిడి ఉంటుందన్నదనే విషయాన్ని తాను అంగీకరించడం లేదన్నాడు. ‘ ఈ వరల్డ్‌కప్‌లో మాపై ఎంత అంచనాలు ఉన్నాయో.. అంతే అంచనాలు భారత్‌ జట్టుపై కూడా ఉన్నాయి. మనం విజయం సాధించిన సందర్భంలో ప్రశంసలు.. అపజయాలు పాలైనప్పుడు విమర్శలు ఎవరికైనా సహజం’ అని తమపై వచ్చిన విమర్శలపై అలీ తిప్పికొట్టాడు.


 

మరిన్ని వార్తలు