మొయిన్ అలీ అజేయ శతకం

16 Dec, 2016 21:34 IST|Sakshi
మొయిన్ అలీ అజేయ శతకం

చెన్నై: భారత్ తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. తొలి రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మరోసారి బ్యాటింగ్ తీసుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్లు జెన్నింగ్స్ (1), అలెస్టర్ కుక్(10)ఆదిలోనే నిష్క్రమించగా,  జో రూట్(88), బెయిర్ స్టో(49)లు రాణించారు.


వీరిద్దరూ మూడో వికెట్ కు 146 పరుగులు జోడించిన తరువాత రూట్  అవుటయ్యాడు. ఆ తరువాత మొయిన్ అలీతో కలిసి స్టో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ జోడి 86 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన తరువాత స్టో అవుటయ్యాడు. ఆపై మొయిన్ అలీ శతకం నమోదు చేసి జట్టును మరింత పటిష్ట స్థితికి చేర్చాడు. ఆట ముగిసే సమయానికి అలీ(120 బ్యాటింగ్), స్టోక్స్(5 బ్యాటింగ్)లు క్రీజ్లో ఉన్నారు.భారత బౌలర్లలో  జడేజా మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మకు వికెట్ లభించింది.

కుక్ రికార్డు..

ఇంగ్లండ్ క్రికెట్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. చివరిదైన ఐదో టెస్టులో కుక్ 11వేల పరుగుల మార్కును చేరాడు. తద్వారా ఈ ఫార్మాట్లో తక్కువ సమయంలో పదకొండు వేలు పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈ పరుగుల్ని కుక్ 10 సంవత్సరాల 290 రోజుల్లోనే సాధించి రికార్డు సృష్టించాడు. అంతకుముందు టెస్టు ఫార్మాట్లో పదకొండు వేల పరుగుల మైలురాయిని ఇంత త్వరగా చేరుకున్న ఆటగాడు లేడు.  

ఈ మ్యాచ్ కు ముందు 10,998 పరుగులతో ఉన్న కుక్.. ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండు పరుగులు చేయడం ద్వారా పదకొండ వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. అయితే ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 10 పరుగులు చేసి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. కుక్ 140 మ్యాచ్ల్లో  252 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనతను సాధించాడు. ఇందులో 30 శతకాలు, 53 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఈ ఏడాది మేలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫాస్టెస్ట్ పదివేల పరుగుల రికార్డును కుక్ అధిగమించిన సంగతి తెలిసిందే. పదివేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ వయసు 31 ఏళ్ల 10 నెలలు. కాగా, కుక్  31 ఏళ్ల 4 నెలల వయసులోనే ఆ మార్కును చేరాడు.

మరిన్ని వార్తలు