మహ్మద్‌ ఆమిర్‌ సంచలన నిర్ణయం

26 Jul, 2019 16:12 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉన్నపళంగా టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే కొనసాగాలనుకుంటున్న ఆమిర్‌.. తాజాగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. ప్రధానంగా వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో అందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని భావించే టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమిర్‌ పేర్కొన్నాడు. ‘ పాకిస్తాన్‌ తరఫున క్రికెట్‌ ఆడాలనేది నా ఏకైక కోరిక. పాకిస్తాన్‌ క్రికెట్‌కు సాధ్యమైనంత వరకూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే నేను దృష్టి సారించా. రాబోవు పరిమిత ఓవర్ల సిరీస్‌లను నేను చాలెంజ్‌గా తీసుకుంటున్నా. కేవలం వైట్‌ బాల్‌ క్రికెట్‌పైనే ఫోకస్‌ చేయాలనుకుంటున్నా’ అని ఆమిర్‌ తెలిపాడు.

ఆమిర్‌ 17 ఏళ్ల వయసులోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2009లో గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లోకి రంగ ప్రవేశం చేశాడు. ఇప్పటివరకూ 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆమిర్‌ 119 వికెట్లు సాధించాడు.  నాలుగేసి వికెట్లను ఆరు సార్లు తీసిన ఆమిర్‌.. ఐదు వికెట్లను నాలుగు సందర్బాల్లో సాధించాడు. పాట్ ఫిక్సింగ్ పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నమొహమద్ ఆమిర్.. 2016లో పునరాగమనం చేశాడు.  అయితే ఆమిర్‌ జాతీయ జట్టులోకి పునరాగమనం తర్వాత మరింత రాటుదేలాడు. 2016 నుంచి ఇప్పటివరకూ 22 టెస్టులు ఆడిన ఆమిర్‌ 68 టెస్టు వికెట్లు సాధించాడు. జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఒక ఇన్నింగ్స్‌లో ఆమిర్‌ 44 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఇదే అతని అత్యుత్తమ టెస్టు ప్రదర్శన.

మరిన్ని వార్తలు