మళ్లీ బరిలోకి 'స్పాట్ ఫిక్సింగ్' క్రికెటర్

24 Jan, 2015 08:43 IST|Sakshi
మళ్లీ బరిలోకి 'స్పాట్ ఫిక్సింగ్' క్రికెటర్

లాహోర్ :స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో నిషేధానికి గురైన పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ మళ్లీ బరిలోకి దిగనున్నాడు. ఐసీసీ సవరించిన కొత్త నిబంధనల ప్రకారం వచ్చేనెల నుంచి  పోటీ క్రికెట్‌లోకి అడుగు పెట్టనున్నాడు. ఇందులో భాగంగానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గత నవంబర్ లో ఐసీసీకి లేఖ రాసింది. ఆమిర్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి సమీక్ష నిర్వహించి అతనికి తక్షణ ఉపశమనం కల్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. 2015 సెప్టెంబర్ నెలతో అతని ఐదు సంవత్సరాల నిషేధ గడువు ముగుస్తుండటంతో ముందుగా దేశవాళీ క్రికెట్ లో అవకాశం కల్పించాలని పీసీబీ విజ్ఞప్తి చేసింది.

 

దీనిపై శుక్రవారం ఐసీసీ  సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  దీంతో ఆమిర్ వచ్చే నెల నుంచి మళ్లీ గుర్తింపు పొందిన పోటీ క్రికెట్ లో ఆడే అవకాశం దక్కింది. ప్రపంచకప్ తరువాత పాక్ లో జరిగే సూపర్-8 ట్వంటీ మ్యాచ్ ల్లో ఆమిర్ పాల్గొనే అవకాశం ఉంది.  2010 లో లార్డ్స్ లో జరిగిన టెస్ట్ లో ఆమిర్ ఫిక్సింగ్ కు పాల్పడటంతో  అతనిపై ఐదు సంవత్సరాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమిర్ ఆరు నెలల జైలు జీవితాన్ని కూడా గడిపాడు. అయితే ఐసీసీ కొత్త నిబంధనలతో ఆమిర్ ఊరట చెందాడు. ఫిక్సింగ్ ఆరోపణల కేసులో  ఏడాది లోపు జైలు జీవితం అనుభవించే క్రికెటర్లు తిరిగి క్రికెట్ ఆడే అవకాశాన్ని ఇస్తూ ఐసీసీ నిబంధనలను సవరించింది.

మరిన్ని వార్తలు