రికార్డు పరుగుతో రియోకు గురి!

26 Jun, 2016 16:49 IST|Sakshi
రికార్డు పరుగుతో రియోకు గురి!

న్యూఢిల్లీ: భారత స్ప్రింటర్ మొహ్మద్ అనాస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. పొలిష్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో భాగంగా రెండో రోజు  జరిగిన పోరులో  సత్తా చాటిన అనాస్ జాతీయ రికార్డు నెలకొల్పాడు.  పురుషుల విభాగంలో 400 మీటర్ల రేసును 45.40 సెకండ్లలో పూర్తి చేసిన అనాస్ జాతీయ రికార్డు సాధించాడు. దీంతో తన రికార్డును అనాస్ సవరించుకోవడమే కాకుండా రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు.  అంతకుముందు ఇదే ఈవెంట్లో తొలిరోజు జరిగిన పోటీలో అనాస్ 45.44  సెకెండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి జాతీయ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే.   దీంతో ఇదే ఈవెంట్ లో మరో  స్ప్రింటర్ రాజీవ్ అరోకియా (45.47 సెకెండ్లు) సాధించిన జాతీయ రికార్డు బద్దలైంది.

 

గత ఏప్రిల్లో ఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెట్ చాంపియన్షిప్లో 400 మీటర్ల రేసును 45. 74 సెకెండ్లలో పూర్తి చేసిన అనాస్ రజత పతకం సాధించాడు. మరోవైపు మొహ్మద్ అనాస్తో పాటు అంకిత్ శర్మ, అతాను దాస్, శ్రబాణి నందాలు తమ విభాగాల్లో రియోకు అర్హత సాధించారు. మహిళల 200 మీటర్ల పరుగులో శ్రబాని నందా, లాంగ్ జంప్లో అంకిత్ శర్మ, ఆర్చరీలోలో  అతాను దాస్లు రియోకు అర్హత సాధించిన వారిలో ఉన్నారు. భారత క్రీడాకారిణి ద్యుతీ చంద్ రియోకు అర్హత సాధించిన తరువాత రోజే మరో నలుగురు భారత అథ్లెట్స్ ఆ మెగా ఈవెంట్కు అర్హత సాధించడం విశేషం.

మరిన్ని వార్తలు