నా క్రికెట్‌ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా?

22 May, 2020 14:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన క్రికెట్‌కు, తనను పరిచయం చేసిన వ్యక్తిని హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్‌, మాజీ ఎంపీ మహ్మద్‌ అజారుద్దీన్ గుర్తుచేసుకున్నారు. ‘నా కెరీర్‌లో మీరందరూ అపారమైన ప్రేమను, మద్దతును చూపించారు. కానీ నా క్రికెట్ ప్రస్థానం ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? మొట్టమొదటిసారిగా నేను క్రికెట్‌ బ్యాట్‌ పట్టేలే చేసింది నా దివంగత మామయ్య మీర్ జైనులాబిదీన్. క్రికెట్‌కు పరిచయం చేసి నా జీవితాన్నే పూర్తిగా మార్చినందుకు ఆయనకు రుణపడి ఉంటా’ అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

క్రికెట్ ప్రేమికులు ముద్దుగా అజ్జూ అని పిలుచుకునే హైదరాబాద్‌ వాసి మహ్మద్ అజహరుద్దీన్ క్రికెట్ క్రీడాకారుడిగా, టీమిండియా కెప్టెన్‌గా సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. హైదరాబాద్‌లో పుట్టి... ఇక్కడే చదువుకుని, ఇక్కడే పెరిగిన ఈ హైదరాబాదీ, ప్రస్తుతం పొలిటీషియన్‌గానూ రాణిస్తున్నారు. టాప్ ఫీల్డర్‌గా ప్రశంసలు... మ్యాచ్ ఫిక్స‌ర్‌గా ఆరోపణలు.. పెళ్లి... విడాకులు... సినీ నటితో ప్రేమ.. పెళ్లి.. మళ్లీ విడాకులు.. ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా గెలుపు వంటి రకరకాల సవాళ్లు, విజయాలు అజారుద్దీన్ కెరీర్‌లో కో కొల్లలు. 

ఇక క్రికెటర్‌గా తన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించిన అజారుద్దీన్‌ రికార్డు ఇప్పటికీ ఎవరూ సమం కూడా చేయలేకపోయారు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికీ అజారుద్దీన్‌ కొనసాగుతున్నాడు. భారత్‌ తరఫున 15 మంది తమ తొలి టెస్టుల్లో సెంచరీలు చేయగా... అజహర్‌తో పాటు గంగూలీ, రోహిత్‌ శర్మ మాత్రమే తొలి రెండు టెస్టుల్లోనూ శతకాలు సాధించారు. అజహర్‌ అనూహ్యంగా ముగిసిన తన కెరీర్‌ చివరి టెస్టు (99వ)లోనూ సెంచరీ సాధించడం విశేషం.

>
మరిన్ని వార్తలు