'అల్లా దయ.. నాకు కరోనా సోకలేదు'

24 Jun, 2020 14:56 IST|Sakshi

లాహోర్‌ : పాక్‌ జట్టులో 10 మంది ఆటగాళ్లకు కరోనా సోకినట్లు పీసీబీ మంగళవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ పది మందిలో పాక్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ హఫీజ్‌ కూడా ఉన్నట్లు పాక్‌ క్రికెట్‌ బోర్డు పేర్కొంది. ఈ విషయంపై పీసీబీ ప్రకటించి ఒక్కరోజు గడవకుండానే హఫీజ్‌ స్పందించాడు. తనకు కరోనా సోకలేదంటూ హఫీజ్‌ ట్విటర్‌ ద్వారా తాను పర్సనల్‌గా చేయించుకున్న కరోనా పరీక్ష రిపోర్టును షేర్‌ చేసుకున్నాడు. 'రిపోర్ట్స్‌లో నాకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని పీసీబీ బోర్డు మంగళవారం స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని మరోసారి దృవీకరించుకోవాలని కుటుంబసభ్యులతో కలిసి నేను మళ్లీ కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకున్నా. కాగా రిపోర్ట్స్‌లో నాతో పాటు కుటుంబసభ్యులకు కూడా నెగెటివ్‌ వచ్చింది. అల్లానే మా కుటుంబాన్ని కాపాడాడు.. ఆయనే మా అందరిని సురక్షితంగా ఉంచుతాడు' అని క్యాప్షన్‌ జత చేశాడు. ('ఆసియా కప్‌ కచ్చితంగా జరుగుతుంది')

కాగా ఇంగ్లండ్‌ పర్యటన కోసమని ఎంపిక చేసిన 29 మంది క్రికెటర్లకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో భాగంగానే సోమవారం ముగ్గురు పాక్‌ క్రికెటర్లు కరోనా బారిన పడగా, మిగతా ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వారిలోషాదాబ్‌ ఖాన్, హైదర్‌ అలీ, హారిస్‌ రవూఫ్, మొహమ్మద్‌ హఫీజ్, వహాబ్‌ రియాజ్, ఫఖర్‌ జమాన్, మొహమ్మద్‌ రిజ్వాన్, మొహమ్మద్‌ హస్‌నైన్, కాశిఫ్‌ భట్టీ, ఇమ్రాన్‌ ఖాన్‌లు ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరిగే 3 టెస్టులు, 3 టి20ల కోసం పాక్‌ జట్టు ఆడాల్సి ఉండగా.. ఇప్పుడు దాదాపు మూడోవంతు మంది కరోనా బారిన పడ్డారు. అయినా సరే షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న పాకిస్తాన్‌ జట్టు ఇంగ్లండ్‌ బయల్దేరుతుందని పీసీబీ ప్రకటించడం విశేషం. అయితే ప్రస్తుతం హఫీజ్‌కు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా రావడంతో ఇంగ్లండ్‌ పర్యటనరు వెళ్లే అవకాశం ఉంది. కాగా కరోనా పాజిటివ్‌ వచ్చిన ఆటగాళ్లకు జూన్‌ 25న మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు తేలింది. (నేనైతే ఆమెతో డేట్‌కు వెళతా: దాదా)

'పాజిటివ్‌గా తేలినవారిలో ఒక్క వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ మాత్రమే టెస్టు స్పెషలిస్ట్‌. అతనికి మాత్రమే తుది జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా వారికి టి20ల కోసం కోలుకునేందుకు తగినంత సమయం ఉందని బోర్డు భావిస్తోంది. రిజ్వాన్‌ గైర్హాజరులో మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌కు అవకాశం దక్కవచ్చు. ముందు జాగ్రత్తగా నలుగురు రిజర్వ్‌ ఆటగాళ్లు బిలాల్‌ ఆసిఫ్, ఇమ్రాన్‌ బట్, మూసా ఖాన్, మొహమ్మన్‌ నవాజ్‌లను ఎంపిక చేశాము. పీసీబీ వారిని కూడా కరోనా టెస్టుల కోసం పంపించింది.' అంటూ పీసీబీ సీఈవో వసీం ఖాన్‌ పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు