మాజీ క్రికెటర్ల తిట్ల పురాణం!

29 Dec, 2015 17:54 IST|Sakshi
మాజీ క్రికెటర్ల తిట్ల పురాణం!

కరాచీ: సాధారణంగా రాజకీయ నాయకుల మధ్య నిర్వహించే చర్చా వేదికలే ఎక్కువగా గందరగోళ పరిస్థితులకు దారి తీస్తుంటాయి. తమ ఆధిపత్య పోరును నిలుపుకునేందుకు వారు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అయితే  క్రికెట్ విశ్లేషణ సందర్భంగా ఆటగాళ్ల మధ్య విభేదాలు చోటు చేసుకున్న ఘటనలు చాలా అరుదు. ఈ తరహా ఘటన తాజాగా పాకిస్తాన్ క్రికెట్ లో కలకలం రేపింది.

ఇద్దరు ప్రముఖ మాజీ క్రికెటర్ల మధ్య నిర్వహించిన టెలివిజన్ డిబేట్ కాస్తా వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. ఇందుకు  మహ్మద్ యూసఫ్, రమీజ్ రాజాలు వేదికగా నిలిచారు. ఎవరైతే గడ్డం పెంచుకుంటారో వారు అబద్ధాలు దూరంగా ఉండాలంటూ వ్యంగ్యంగా మాట్లాడి తొలుత వివాదానికి తెరలేపాడు రమీజ్ రాజా.  దీనిపై తీవ్రంగా స్పందించిన యూసఫ్.. 'సిగ్గుమాలిన పనులు చేసేవారే నీలా అర్థంలేకుండా మట్లాడతారు. నీకు క్రికెట్ ఆడే సామర్థ్యమే లేదు. నువ్వు ఒక మాటకారివి.  మరోసారి అదే మాటలతో మాయ చేస్తున్నావు. గడ్డాన్ని పెంచుకోవడానికి నువ్వు అర్హుడవే కావు. నువ్వు పాకిస్తాన్ క్రికెట్ లో ఉద్ధరించిందేమీ లేదు. 57 టెస్టుల్లో రెండు సెంచరీలు మాత్రమే చేశావు. అసలు ప్రముఖ క్రికెటర్ ఎలా అయ్యావో అనేది మరోసారి చూడాలనుకుంటున్నా. నీలాంటి వాళ్లు క్రికెట్ గురించి మాట్లాడకూడదు. నువ్వొక ఇంగ్లిష్ టీచర్వి మాత్రమే. అంతకుమించి నీకు తెల్సిందేమీ లేదు' అని యూసఫ్ విమర్శలకు దిగాడు.

'నువ్వు ఏమీ మాట్లాడినా ఫర్వాలేదు.. కానీ నువ్వు క్రికెట్ లో చీడ పురుగు మాదిరి తయారయ్యావు 'అని రమీజ్ బదులిచ్చాడు. అవును నాకు క్రికెటే సర్వస్వం. నాకు అది తప్ప ఇంకోటి తెలీదు. ఆ పని నీ వల్ల కాదు ' అని యూసఫ్ మరోసారి ఎదురుదాడి చేశాడు. వీరి వ్యక్తిగత దూషణల పర్వం తారాస్థాయికి చేరడంతో యాంకర్ కల్పించుకుని సర్దిచెప్పే యత్నం చేసి వారిద్దరి పంపించి వేశాడు. దీంతో ఆ డిబేట్ అర్థాంతరంగా ముగియక తప్పలేదు.

మరిన్ని వార్తలు