అందుకు నేను మాత్రమే కారణం : షమీ

28 Jun, 2019 14:22 IST|Sakshi

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరుకే పరిమితమైనా, బౌలర్ల విజృంభణతో 125 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా మెగాటోర్నీలో ఐదో గెలుపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా పేసర్లు పేసర్లు షమీ (4/16), బుమ్రా (2/9), స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ (2/39) ప్రత్యర్థిని దెబ్బతీసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ క్రమంలో మ్యాచ్‌ అనంతరం షమీ మాట్లాడుతూ తన ప్రదర్శన పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చోటు చేసుకున్నాయని అయితే.. దేవుడి దయతో వాటన్నింటినీ అధిగమించానని చెప్పుకొచ్చాడు.

అందుకు నేనే కారణం..
‘ కొంత కాలంగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను. గత పద్దెనిమిది నెలలు ఎంతో భారంగా గడిచాయి. అప్పుడు నేనెంతగా బాధ పడ్డానో నాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇప్పుడు విజయాలకు క్రెడిట్‌ నాకే దక్కుతుంది కదా. అయితే దీనికంతటికి నాకు శక్తినిచ్చింది ఆ భగవంతుడే. ఫిట్‌నెస్‌, వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యల కారణంగా ఎంతో వేదన అనుభవించాను. యో-యో టెస్టులో విఫలమైనపుడు బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం డైట్‌ మెయింటేన్‌ చేస్తూ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాను. ఇప్పుడు తొందరగా అలసిపోవడం లేదు. ఏ ట్రాక్‌పై అయినా గానీ చెలరేగి ఆడగలనన్న నమ్మకం వచ్చింది అని షమీ విశ్వాసం వ్యక్తం చేశాడు. అదే విధంగా తన విజయానికి కేవలం తాను మాత్రమే కారణమని పేర్కొన్నాడు.

కాగా వరకట్నం కోసం తనను వేధిస్తున్నాడంటూ షమీ భార్య హసీన్‌ జహాన్‌ అతడిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఒకానొక సమయంలో ఈ వివాదం కారణంగా షమీ కెరీర్‌ నాశనమయ్యే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు విచారణ ఎదుర్కొన్న షమీ.. బీసీసీఐ నుంచి క్లీన్‌చిట్‌ పొందాడు. అనంతరం ఆటపై దృష్టి సారించి కెరీర్‌ను గాడిలో పెట్టుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో మెరుగ్గా ఆడుతూ.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు.

ఇక గురువారం నాటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కోహ్లి కీలక ఇన్నింగ్స్‌తో పాటు చివర్లో ధోని మెరుపులు భారత్‌ను ఆదుకోగా, బౌలింగ్‌లో షమీ, బుమ్రాల సూపర్‌ ప్రదర్శన ఘన విజయాన్ని అందించాయి. దీంతో టీమిండియాకు ఎంతో కొంత పోటీనివ్వగలదని భావించిన వెస్టిండీస్‌ కూనల స్థాయి బ్యాటింగ్‌ ప్రదర్శనతో పరాజయాన్ని ఆహ్వానించింది. మెరుగైన బౌలింగ్‌తో కోహ్లి సేనను నిరోధించగలిగిన ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించడంలో మాత్రం పేలవ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా ప్రపంచ కప్‌లో సెమీస్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన మూడో జట్టుగా నిలిచింది. ఇక అజేయ భారత్‌ తదుపరి లక్ష్యం ఆదివారం ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించడమే! 

>
మరిన్ని వార్తలు