బీసీసీఐ ఏం చెప్పింది.. షమీ ఏం చేశాడు..!

22 Nov, 2018 10:52 IST|Sakshi

కోల్‌కతా: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా జట్టులో చోటు దక్కని పేసర్‌ మహ్మద్‌ షమీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. కోల్‌కతా తరపున బరిలోకి దిగాడు. దీనిలో భాగంగా షమీకి ముందుగానే బీసీసీఐ కొన్ని సూచనలు చేసింది. తరచు గాయాల బారిన పడుతున్న షమీని ఒక ఇన్నింగ్స్‌లో 15-17 ఓవర్లు మించి బౌలింగ్‌ వేయవద్దని స్పష్టం చేసింది. అయితే బీసీసీఐ మార్గదర్శకాలను షమీ పట్టించుకోలేదు. కేరళతో ఈడెన్‌ గార్డెన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ 15 ఓవర్ల సూచనను పక్కన పెట్టేశాడు. అదే సమయంలో ఒక ఇన్నింగ్స్‌లో 26 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేశాడు.

ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే షమీకి బీసీసీఐ ఇలా సూచన చేయడం జరిగింది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ తర్వాత జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో షమీకి సెలక్టర్లు చోటు కల్పించారు. ఒకవేళ రంజీల్లో షమీ గాయపడితే భారత బౌలింగ్‌ యూనిట్‌ బలహీన పడుతుందని భావించి మాత‍్రమే అతనికి బోర్డు పెద్దలు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఒక ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు బౌలింగ్‌ వేసిన షమీ.. బీసీసీఐ సూచనను పెద్దగా పట్టించుకున్నట్లు కనబడలేదు. మరొకవైపు ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్‌ వేయడాన్ని షమీ సమర్దించుకున్నాడు. ‘ ఒక రాష్ట్రం తరుపున ఆడుతున్నప్పుడు ఒక బాధ్యత ఉంటుంది. దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తేనే న్యాయం చేసినట్లు. నేను ఇలా బౌలింగ్‌ వేసినప‍్పటికీ అసౌకర్యంగా అనిపించలేదు’ అని షమీ పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు బౌలింగ్‌ వేసిన షమీ.. 100 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.

మరిన్ని వార్తలు