కోర్టు బయట పరిష్కరించుకుంటాం: షమీ

12 Mar, 2018 03:53 IST|Sakshi
మొహమ్మద్‌ షమీ, హసీన్‌ జహాన్‌

న్యూఢిల్లీ: తన భార్యతో తలెత్తిన వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారత క్రికెటర్‌ మొహమ్మద్‌ షమీ తెలిపాడు. తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్‌ జహాన్‌ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గృహహింస, హత్యాయత్నం కింద షమీపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. ‘ఈ సమస్యపై చర్చించి పరిష్కరించుకోవడం మినహా చేసేదేమీ లేదు.

కోర్టు వెలుపల పరిష్కారం కనుగొనడమే నాకు, నా పాపకు, నా కెరీర్‌కు ప్రయోజనకరం. కోల్‌కతాకు వెళ్లి నా భార్యతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా’ అని మీడియాతో షమీ అన్నాడు. మరోవైపు అతని భార్య కూడా వివాద పరిష్కారానికే మొగ్గుచూపుతోంది. ‘నేను అతని అనుచిత స్క్రీన్‌ షాట్స్, వాట్సాప్‌ మెసేజ్‌లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాకే షమీ నిజ స్వరూపమేంటో బయటపడింది. అయితే ఇప్పటికీ అతను నిజాయతీగా తన తప్పులను సరిదిద్దుకుంటానంటే మా అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు.

సయోధ్యపై ఆలోచిస్తాను’ అని హసీన్‌ తెలిపింది. ‘అతని ఫోన్‌ నాకు దొరకడం, అందులో అభ్యంతరకర ఫొటోలు, చాటింగ్‌లు ఉండటం వల్లే షమీ మిన్నకుండిపోయాడు. లేదంటే ఇప్పటికే విడాకులిస్తానని కోర్టుకెక్కేవాడు’ అని ఆమె చెప్పింది. మరోవైపు ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టును కోల్పోయిన షమీకి ఐపీఎల్‌–11 సీజన్‌ కూడా చేజారే ప్రమాదముంది. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు షమీని ఆడించాలా వద్దా? అనే అంశంపై బోర్డు అనుమతి కోరింది. బీసీసీఐ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ సీఈఓ హేమంత్‌ దువా వెల్లడించారు.  

మరిన్ని వార్తలు