షమీ...నేను పిచ్చోణ్ని కాదు!

11 May, 2020 02:48 IST|Sakshi

ధోని ఆగ్రహాన్ని గుర్తుచేసుకున్న పేసర్‌

కోల్‌కతా: ‘మిస్టర్‌ కూల్‌’ ధోని తన సహచరుల్ని దారిలో పెట్టేందుకు అప్పుడప్పుడూ కోపాన్ని కూడా ప్రదర్శిస్తాడు. కానీ ఇవేవీ మనకు లైవ్‌ మ్యాచ్‌ల్లో కనిపించవు. ఇవి చవిచూసిన ఆటగాళ్లు చెబితేతప్ప తెలియదు. ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న పేసర్‌ మొహమ్మద్‌ షమీ దీన్ని ఇప్పుడీ లాక్‌డౌన్‌ సమయంలో తన బెంగాల్‌ రంజీ జట్టు సహచరుడు మనోజ్‌ తివారీతో పంచుకున్నాడు. 2014లో న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా వెల్లింగ్టన్‌లో జరిగిన టెస్టులో సరిగా సంధించని బంతిపై కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే మహీకి కోపమొచ్చిందట. వెంటనే ‘దేఖ్‌ బేటా... బహుత్‌ లోగ్‌ ఆయే మేరే సామ్నే... బహుత్‌ లోగ్‌ ఖేల్‌కే చలే గయే. జూట్‌ మత్‌ బోల్‌. తుమారే సీనియర్, తుమారే కెప్టెన్‌ హై హమ్‌. యే బేవకూఫ్‌ కిసీ ఔర్‌కో బనానా’ (చూడు బిడ్డా... నేను ఎంతో మందిని చూశాను. నా కళ్ల ముందు ఆడి వెళ్లిన వారెందరో ఉన్నారు.

ఇలాంటి అబద్ధాలు చెప్పకెప్పుడూ. నేను నీ సీనియర్ని. కెప్టెన్నీ కూడా... నన్ను పిచ్చోణ్ని చేయకు. వేరే వాళ్లెవరినైనా మభ్యపెట్టు) అని మందలించినట్లు అప్పటి సంఘటనని పేసర్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ మంచి స్థితిలో ఉన్నప్పటికీ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (302) ట్రిపుల్‌ సెంచరీతో గెలుపు దూరమైందని, నిజానికి 14 పరుగుల వద్ద కోహ్లి క్యాచ్‌ వదిలేయడంతో అతను సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆవిష్కరించాడని షమీ వివరించాడు. మళ్లీ 300కు చేరువైనప్పుడు కూడా క్యాచ్‌ వదిలేయడంతో అసహనానికి గురైన షమీ తర్వాత బంతి బౌన్సర్‌ వేశాడు. ఆ బౌన్సర్‌ను ధోని అందుకోలేకపోవడం... అదికాస్తా బౌండరీ దాటిపోవడం జరిగాయి. దీనిపై ధోని సంజాయిషీ కోరగా షమీ ఏదో చెప్పబోయాడు. దాంతో ‘మిస్టర్‌ కూల్‌’ తనకు ఘాటుగా బదులిచ్చాడని షమీ అప్పటి విషయాన్ని వివరించాడు.

మరిన్ని వార్తలు