ఆసియా కప్‌కు షమీ దూరం

20 Feb, 2016 01:01 IST|Sakshi
ఆసియా కప్‌కు షమీ దూరం

 టి20 ప్రపంచకప్‌కూ డౌటే!
  
న్యూఢిల్లీ: తొడ కండరాల గాయంతో సతమతమవుతున్న భారత పేసర్ మొహమ్మద్ షమీ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అతను ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో ఆడేది కూడా అనుమానంగానే ఉంది. సెలక్షన్ కమిటీ ఇతని స్థానంలో సీమర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేసింది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం గాయంతో సుదీర్ఘ కాలం జట్టుకు దూరమైన అతన్ని ఆసియా కప్‌లో తలపడే భారత జట్టుకు ఎంపిక చేశారు. అయితే షమీ ఫిట్‌గా లేడని బీసీసీఐ మెడికల్ టీమ్ ధ్రువీకరించింది.  

 యూఏఈ శుభారంభం
మరోవైపు ఢాకాలో శుక్రవారం మొదలైన ఆసియా కప్ టి20 క్వాలిఫయింగ్ టోర్నీలో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) శుభారంభం చేసింది. అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ 16 పరుగులతో గెలిచింది. తొలుత యూఏఈ 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేయగా... అఫ్ఘానిస్తాన్ 19.5 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది.  మరో మ్యాచ్‌లో ఒమన్ 5 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై గెలిచింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ ఏడు వికెట్లకు 175 పరుగులు చేసి ఓడింది. హాంకాంగ్ బ్యాట్స్‌మన్ బాబర్ హయాత్ (60 బంతుల్లో 122; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేసినా తన జట్టును గెలిపించలేకపోయాడు. యూఏఈ, అఫ్ఘానిస్తాన్, ఒమన్, హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఈనెల 24న మొదలయ్యే ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తుంది.

మరిన్ని వార్తలు