‘ధోనిని మిస్సవుతున్నా.. మళ్లీ ఆ రోజులు రావాలి’

3 Jun, 2020 11:17 IST|Sakshi

హైదరాబాద్ ‌: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనిపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ. మంగళవారం ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న షమీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఐపీఎల్‌ మినహా ధోని సారథ్యం, మార్గనిర్దేశకంలో అన్ని ఫార్మట్లు ఆడాను. అతను జట్టు సభ్యులతో ఉండటం, మాట్లాడే విధానం చూస్తే అసలు మనతో ఉంది ధోనినేనా అనే అనుమానం కలిగేది. జూనియర్స్‌కు ధైర్యం చెబుతాడు. అదేవిధంగా సీనియర్స్‌కు వారి బాధ్యతలను గుర్తుచేస్తాడు. (నేను స్లెడ్జ్‌ చేస్తా.. నువ్వు కేవలం నవ్వు అంతే!)
 
ధోని అత్యద్భుతమైన ఆటగాడు. అతనితో నాకు చాలా తీపి గుర్తులే ఉన్నాయి. ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను.. మహి భాయ్‌ తిరిగి జట్టులోకి రావాలి, మేమందరం మరోసారి సరదాగా ఆడాలి అని. ధోనితో కలిసి అందరం డిన్నర్‌ చేసేవాళ్లం. చాలా సరదాగా అనిపించేది. ఇక అతని చుట్టూ ఎప్పటికీ కనీసం ముగ్గురు నలుగురైనా ఉండేవారు. అర్దరాత్రి వరకు అనేక విషయాలపై ముచ్చటించేవాళ్లం. ఇవన్నీ మిస్సవుతున్నా. మళ్లీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నా’ అంటూ షమీ తన మనసులోని మాట బయటపెట్టాడు. (షమీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా)

ఇక ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌-2019 అనంతరం ధోని మళ్లీ టీమిండియా జెర్సీ ధరించలేదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ధోని ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఐపీఎల్‌ నిరవధికా వాయిదా పడింది. దీంతో ధోని పునరాగమనంపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ధోని రిటైర్మెంట్‌పై, భవిష్యత్‌ ప్రణాళికలపై సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వస్తున్నప్పటికీ అతడు ఇప్పటిరకు స్పందించలేదు. (ప్రపంచకప్‌ కాని ప్రపంచకప్‌) 

మరిన్ని వార్తలు